LOADING...
Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? 
13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థల వరకు... సత్యం కుమార్ ప్రయాణం నిజంగా ఓ అద్భుత గాథ. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఐఐటీ అర్హత సాధించి, 24ఏళ్లకే పీహెచ్‌డీ పూర్తి చేసిన ఈ భారతీయ యువ మేధావి కథ ప్రతి విద్యార్థికి గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. యాపిల్(Apple)వంటి టెక్ దిగ్గజ సంస్థలో పనిచేసిన సత్యం కుమార్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా గుర్తింపు పొందిన ఐఐటీ-జేఈఈని ఛేదించడం లక్షలాది విద్యార్థుల కల. అలాంటి పరీక్షను సత్యం కుమార్ అత్యంత చిన్న వయసులోనే విజయవంతంగా అధిగమించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

Details

అరుదైన రికార్డులు

బీహార్ రాష్ట్రం భోజ్‌పూర్ జిల్లా బఖోరాపూర్ అనే చిన్న గ్రామంలో, ఒక రైతు కుటుంబంలో జన్మించిన సత్యం, తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సత్యం కుమార్ 2012లో తొలిసారిగా ఐఐటీ-జేఈఈ పరీక్ష రాశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 12 ఏళ్లు మాత్రమే. ఆ పరీక్షలో 8,137 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. అయితే దీనితో తృప్తి పడకుండా, మరింత మెరుగైన ర్యాంకు లక్ష్యంగా పెట్టుకున్నారు. తదుపరి ఏడాది 2013లో మరోసారి జేఈఈ పరీక్ష రాసి, 670వ ఆల్ ఇండియా ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.

Details

విద్యా ప్రయాణం 

ఈ విజయంలో భాగంగా, 13 ఏళ్ల వయసులోనే ఐఐటీ కాన్పూర్‌లో అడుగుపెట్టి, అప్పటివరకు సాహక్ కౌశిక్ (14 ఏళ్లు) పేరిట ఉన్న 'అతి పిన్న వయస్కుడైన ఐఐటీయన్' రికార్డును సత్యం కుమార్ చెరిపివేశారు. దీంతో 'యంగెస్ట్ ఐఐటీయన్'గా దేశవ్యాప్తంగా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మరియు ఎంటెక్ డ్యూయల్ డిగ్రీలను సత్యం పూర్తి చేశారు. విద్యాభ్యాసంలోనూ నిరంతర పట్టుదలతో ముందుకుసాగిన ఆయన, ఉన్నత చదువుల కోసం అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ టెక్సాస్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి, కేవలం 24 ఏళ్లకే డాక్టరేట్ పట్టా సాధించారు.

Advertisement

Details

యాపిల్‌లో అవకాశం

సత్యం కుమార్ ప్రతిభను గుర్తించిన ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple), ఆయనకు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా అవకాశం కల్పించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా అత్యాధునిక సాంకేతికతలపై ఆయన విలువైన అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సత్యం కుమార్ ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ సంస్థ టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ (Texas Instruments)లో 'మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇంజనీర్'గా పనిచేస్తున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ప్రపంచ స్థాయి టెక్ నిపుణుడిగా ఎదిగిన సత్యం ప్రయాణం, లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏ అడ్డంకీ అజేయం కాదన్న విషయాన్ని బలంగా చాటుతోంది.

Advertisement