ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌లో ఈనెల 17 వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ చెప్పింది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ఉత్తరాఖండ్, విదర్భ, సౌరాష్ట్ర, కచ్, మరఠ్వాడా, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవాలకు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల ఈ వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ భారతంలో రాబోయే రెండు రోజులు వర్షాలు
కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌తో సహా పశ్చిమ ప్రాంతంలో సెప్టెంబర్ 18 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర, మధ్య మహారాష్ట్రలో సెప్టెంబర్ 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ భారతంలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు 19వ తేదీ వరకు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.