IMD Alert : మే 16 నుండి వాయువ్య భారతదేశంలో వడగాల్పులు..ఐఎండీ హెచ్చరిక
దేశంలోని చాలా రాష్ట్రాల్లో తుఫాను, వర్షం కారణంగా మండుతున్న వేడి నుండి కొంత ఉపశమనం లభించింది. అయితే ఇప్పుడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వేడిగాలులు మొదలయ్యే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం, మే 14 వరకు తూర్పు, మధ్య భారతదేశంలో తుఫాను, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో మే 16 వరకు ఇదే వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తరువాత, మే 16 నుండి వాయువ్య భారతదేశంలో వేడిగాలులు మొదలవుతాయి. మే 13న చత్తీస్‌గఢ్, విదర్భ, మధ్యప్రదేశ్‌లో ఉరుములతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మే 16 నుంచి ఢిల్లీలో హీట్ వేవ్ అలర్ట్
మే 13న ఢిల్లీ పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఆ తర్వాత ఆకాశం నిర్మలమవుతుందని భావిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఢిల్లీ వాసులు ఇప్పుడు 40 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా వాయువ్య భారతదేశంలో మే 16 నుండి హీట్ వేవ్ కొనసాగుతుంది. IMD ప్రకారం, ఈ వారం మొత్తం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
దేశంలో వాతావరణ పరిస్థితి
వాతావరణ సూచన ఏజెన్సీ స్కైమెట్ ప్రకారం.. రాబోయే 24 గంటల్లోదక్షిణ ఒడిశా,కర్ణాటక,కేరళ, తెలంగాణ,బీహార్,ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో ఈదురు గాలులు (40-50 కి.మీ./గం) తో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పశ్చిమ హిమాలయాలలోని సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడా మంచు కురుస్తుంది. ఇది కాకుండా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశం, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తూర్పు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, లక్షద్వీప్,అండమాన్ అండ్ నికోబార్ దీవులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో చెదురుమదురు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.