IMD Rain Aalert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వేళ వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా,మధ్యాహ్నానికి తీవ్రంగా పెరుగుతున్న వేడి కారణంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. అయితే ఈపరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని సమాచారం వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల ప్రభావంతో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవగా, గురువారం కూడా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు,గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని చోట్ల ధూళి తుఫానులు ఏర్పడి జనజీవనంపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
వివరాలు
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
దేశ రాజధాని ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ధూళి తుఫానులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా బలమైన గాలులు, ఆకస్మిక ధూళి తుఫానులు ఉండవచ్చని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో పాటు బలమైన గాలుల ప్రభావంతో చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరా అంతరాయం కలగవచ్చని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని సూచించారు.
వివరాలు
ఈశాన్య భారతదేశంలో నిరంతర వర్షాలు కొనసాగే అవకాశం
రాబోయే రోజుల్లో ఈశాన్య భారతదేశంలో నిరంతర వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, చెట్లు,విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని వాతావరణ శాఖ సూచించింది.