CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు రుణమాఫీ ఎలా అమలు చేశామో, రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని, ఇంత పెద్ద అప్పు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, అధికారులు చెప్పలేదని ఆయన విమర్శించారు.
రూ.21వేల కోట్ల రుణాలను మాఫీ చేశాం
అప్పుల భారాన్ని చూసి ఆధైర్య పడకుండా పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అదే విధంగా రైతు బంధు అప్పు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని, ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. ఈనాటికీ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం కేవలం కాంగ్రెస్ పార్టీదే కావాలని, రుణమాఫీ విషయంలో బీజేపీ ప్రభుత్వం రైతులను పదేళ్లపాటు మోసం చేశారని ఆయన విమర్శించారు.