
Election Code Cash Limit: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు.. ఒక్క వ్యక్తికి రూ.50వేలు మాత్రమే అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సులు సహా అన్ని రవాణా వాహనాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు. నిన్నటి నుంచే జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలను సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్క వ్యక్తి గరిష్టంగా రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్ళగలరు. అంతకంటే ఎక్కువ నగదు తీసుకువెళ్ళాలనుకుంటే, సరైన పత్రాలు అవసరం.
Details
అధారాలు చూపకపోతే జప్తు
పత్రాలు లేకుంటే పోలీసులు అదనపు నగదును సీస్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే, ఎన్నికల అధికారులు ఆదాయపన్ను (జీఎస్టీ) అధికారులకు సమాచారం అందించి, ఆ నగదును కోర్టులో జమ చేస్తారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాల కోసం పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్ళేవారు, సరైన ఆధారాలను ముందే అధికారులు చూపించాలి. తనికీల సమయంలో ఆధారాలు చూపలేకపోయినా, తర్వాత పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి పొందవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల, నగదు రవాణాపై నియమాలు కచ్చితంగా పాటించాలన్నది అధికారుల సూచన.