Andhra News: కృష్ణపట్నం థర్మల్‌కు విదేశీ బొగ్గు.. జనవరి నుంచి సరఫరా ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి త్వరలో విదేశీ బొగ్గు రానుంది. ఇందుకు సంబంధించి ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా బాధ్యతను అదానీ సంస్థకు అప్పగిస్తూ జెన్‌కో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎల్‌వోఏ) జారీ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం జనవరి నెల నుంచి బొగ్గు సరఫరా ప్రారంభమై మూడు నెలల్లో మొత్తం పరిమాణం చేరాల్సి ఉంటుంది. వేసవి కాలంలో విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలపై జెన్‌కో ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని థర్మల్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంలో కనీసం 85 శాతం వరకు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
వివరాలు
మొదటి నౌక బయలుదేరింది
దీనిలో భాగంగా కృష్ణపట్నం థర్మల్ కేంద్రంలోని తొలి రెండు యూనిట్ల డిజైన్ ప్రకారం 70 శాతం వరకు విదేశీ బొగ్గు వినియోగించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. అందుకే విదేశీ బొగ్గు సరఫరా కోసం జెన్‌కో టెండర్లు ఆహ్వానించింది. ఒప్పందం మేరకు ఇండోనేసియా నుంచి కనీసం 6 వేల గ్రాస్ కెలోరిఫిక్ విలువ (జీసీవీ) ఉన్న నాణ్యమైన బొగ్గును అదానీ సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తొలి రవాణాగా 75వేల టన్నుల బొగ్గుతో కూడిన నౌక ఇప్పటికే అక్కడి నుంచి ప్రయాణమైంది. సంక్రాంతి నాటికి ఆ నౌక కృష్ణపట్నం పోర్టుకు చేరుకునే అవకాశముందని అధికారులు వెల్లడించారు. పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బొగ్గు నేరుగా థర్మల్ యూనిట్లకు చేరనుంది.
వివరాలు
కృష్ణపట్నంలో కొత్త రికార్డు
ఈ సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా బొగ్గు దిగుమతి చేయకుండా, తక్కువ పరిమాణాల్లో తెప్పించడం ద్వారా పోర్టు హ్యాండ్లింగ్ ఛార్జీల భారం తగ్గించుకునే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఒకేసారి 1.10లక్షల టన్నుల వరకు బొగ్గు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ,ప్రస్తుతం ప్రతి రవాణాను 75వేల టన్నులకే పరిమితం చేస్తున్నారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా గత వారం రోజులుగా నిరంతరంగా రికార్డు స్థాయిలో 2,035మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తోంది. గతంలో ఈ ప్లాంటు ఉత్పత్తి సాధారణంగా 1,200 నుంచి 1,400 మెగావాట్ల మధ్యనే ఉండేది. ఈ కేంద్రంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లు ఉండగా,అవన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే 2,400 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యమవుతుంది.
వివరాలు
రోజుకు 14 ఎంయూ అదనపు విద్యుత్
అయితే ప్లాంటు ఏర్పాటు చేసిన నాటి నుంచి 60 నుంచి 65 శాతం సామర్థ్యంలోనే యూనిట్లు పనిచేస్తున్నాయి. డిజైన్ ప్రకారం మొదటి రెండు యూనిట్లలో 70 శాతం వరకు 6 వేల జీసీవీకి మించిన విదేశీ బొగ్గు, మిగిలిన 30 శాతం స్థానిక బొగ్గు వినియోగించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పూర్తిగా స్థానిక బొగ్గునే వినియోగించడంతో పూర్తి సామర్థ్యానికి తగిన ఉత్పత్తి సాధ్యపడలేదు. విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు జెన్‌కో పలు ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేసింది. ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్) నుంచి పొందుతున్న బొగ్గు కోటాలో సుమారు లక్ష టన్నులను కోల్‌కతాలోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి తీసుకునేలా మార్పు చేసింది.
వివరాలు
రోజుకు 14 ఎంయూ అదనపు విద్యుత్
అక్కడ నుంచి కనీసం 5,800 జీసీవీ నాణ్యత కలిగిన బొగ్గు లభిస్తుండటంతో పాటు, ఎంసీఎల్ నుంచి సరఫరా అయ్యే వాష్డ్ కోల్‌ను కలిపి ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఈ చర్యల వల్ల ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫలితంగా రోజుకు సుమారు 600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీని ద్వారా డిస్కంలకు రోజుకు దాదాపు 14 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. దీంతో పీక్ డిమాండ్ సమయంలో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం గణనీయంగా తగ్గింది. కృష్ణపట్నం ప్లాంటు నుంచి యూనిట్ విద్యుత్ రూ.4.20కే లభిస్తుండటంతో విద్యుత్ కొనుగోలు ఖర్చులో భారీగా ఆదా అవుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.