NITI Aayog Meet:నీతి ఆయోగ్ సమావేశానికి మొత్తం 28 రాష్ట్రాల సీఎంలు హాజరు.. వికసిత్ భారత్‌కు కలిసి పనిచేద్దామన్న మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా పలువురు సీఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉంటూ వచ్చిన నేపథ్యంలో.. ఈసారి మొత్తం 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ నుంచి వీడీ సతీశన్, జమ్మూకశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు విపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.
వివరాలు
కేంద్ర-రాష్ట్రాల సమిష్టిభాగస్వామ్యం అత్యంత కీలకం : మోదీ
సమావేశం అనంతరం ఉత్తరప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక,తెలంగాణ,జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ సమావేశానికి గతంలో పలువురు సీఎంలు గైర్హాజరైన విషయం తెలిసిందే. గతేడాది నలుగురు,2024లో పది మంది,2023లో తొమ్మిది మంది ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. దీంతో ఈసారి కూడా ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల సీఎంలు సమావేశాన్ని బహిష్కరిస్తారని భావించారు. అయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోవడం విశేషంగా నిలిచింది. సమావేశానికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ప్రధాని మోదీ.. ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్రం,రాష్ట్రాలు కలిసి దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే కేంద్ర-రాష్ట్రాల సమిష్టిభాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన తెలిపారు.
వివరాలు
అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ బలమైన వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ధైర్యంగా ముందుకు సాగుతోందని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, ఇవి దేశ అభివృద్ధితో పాటు ఎగుమతుల పెరుగుదలకు దోహదపడతాయని చెప్పారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ఒప్పందాలు కొత్త అవకాశాలను తీసుకొస్తాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ప్రపంచ మార్కెట్లలో పోటీపడడం ద్వారా భారత పరిశ్రమల సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపారు.
వివరాలు
వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రధాన శక్తిగా యువత
నాణ్యమైన విద్య, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. యువతకు అవసరమైన అవకాశాలు కల్పిస్తే వారే వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రధాన శక్తిగా మారతారని అన్నారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు మరింత బలోపేతం కావాలని, కేంద్రంతో సమన్వయాన్ని పెంచడంలో నీతి ఆయోగ్ సమర్థవంతమైన వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
మహిళల సాధికారతే వికసిత్ భారత్‌కు బలం
మహిళల నేతృత్వంలోని అభివృద్ధి వికసిత్ భారత్‌కు పునాదిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయం నుంచి స్టార్టప్‌లు, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల వరకు అన్ని రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. మహిళల పూర్తి సామర్థ్యాలను వెలికితీయాలంటే విద్య, నైపుణ్యాభివృద్ధి, భద్రత, ఆర్థిక సాధికారతపై రాష్ట్రాలు మరింత దృష్టి సారించాలని సూచించారు.
వివరాలు
ఎల్‌నినోపై అప్రమత్తం.. నీటి సంరక్షణకు ప్రాధాన్యం
వర్షాకాలంపై ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశాలపై కూడా ప్రధాని మోదీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు నీటి వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సహజసిద్ధమైన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు 11 లక్షల టన్నుల సహజ ఎరువులను కొనుగోలు చేశారని, పర్యావరణహిత వ్యవసాయంపై రైతుల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.