చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్
2020 నుంచి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసీ) వద్ద భారత్ -చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా కవ్విస్తూనే ఉంటోంది. ఈ క్రమంలో చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో రోడ్లు లేని వ్యూహాత్మక ప్రాంతాల్లో 300కి.మీ పొడవునా నాలుగు ప్రధాన సరిహద్దు రహదారులను నిర్మించే ప్రణాళికను ప్రారంభించింది. ఈ మేరకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఐ) ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే ఎల్ఏసీ వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో ఐటీబీపీ, ఆర్మీ సిబ్బంది సైనిక సామగ్రి తరలించడం మరింత సులభం అవుతుంది.
వ్యూహాత్మక ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం
అరుణాచల్ ప్రదేశ్‌లోని ట్యూటింగ్ నుం ముయిర్బే మీదుగా ఎల్‌ఎసీ సమీపంలోని బామే వరకు 72కి.మీ పొడవున కొత్త రహదారిని నిర్మించనున్నారు. టాపా నుంచి హుష్ మీదుగా అరుణాచల్ సరిహద్దు ప్రాంతమైన డిల్లీ వరకు మరో 58 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. హ్యూలియాంగ్ నుంచి కుండావో వరకు 107 కిలోమీటర్లు, కిబితు నుంచి కుండావో వరకు మరో 52 కి.మీ రహదారిని నిర్మించనున్నారు. ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని బీఆర్‌వోను కేంద్రం ఇప్పటికే కోరింది. ఈ రహదారులు అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లోని వ్యూహాత్మక ప్రాజెక్టులని ప్రభుత్వ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి.