Jammu kashmir: రాంబన్‌లో ముగ్గురు బాలికలు సజీవదహనం
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని మారుమూల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సోమవారం ఓ ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు టీనేజ్ అక్కాచెల్లెళ్లు సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. ఉఖ్రాల్ బ్లాక్‌లోని ధన్మస్తా-తజ్నిహాల్ గ్రామంలోని మూడంతస్తుల ఇంట్లో తెల్లవారుజామున మంటలు వ్యాపించాయని వారు తెలిపారు. ఆ ఇంట్లో బిస్మా (18), సైక (14), సానియా (11) - పై అంతస్తులో నిద్రిస్తుండగా, ఇల్లు మొత్తం మంటలలో చిక్కుకోవడంతో వారు బయటకు రాలేక పూర్తిగా సజీవదహనం అయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఆ మంటల్లో ముగ్గురు మైనర్ బాలికలు మరణించారు. కాగా, వారి మృతదేహాలను అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది కపోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.