బెంగళూరు:వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించిందని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
బెంగళూరు సమీపంలో బిదనూరుకు చెందిన మంజునాథ్ కు ఇద్దరు కుమార్తెలు. అతని పెద్ద కూతురు(20) వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న మంజునాథ్ పరువు పోయిందంటూ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనహళ్లి సమీపంలోని బిదలూరు గ్రామంలో నివాసం ఉంటున్న కళాశాల విద్యార్థిని కవనకు వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకొని తండ్రి మంజునాథ్ ఆమెను హెచ్చరించాడు. అయినా, కవన పట్టించుకోలేదు. అంతే కాదు అప్పటికే కవన చెల్లెలు కూడా ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. తన చెల్లెల్ని చెడగొట్టడానికి, ప్రేమలో పడడానికి కవన కారణమని మంజునాథ్ ఆరోపించాడు.
హత్య చేసి పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన తండ్రి
బుధవారం రాత్రి ఈ విషయమై మంజునాథ్,కవన మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంతో మంజునాథ్ కత్తి తీసుకుని కవన గొంతు కోసి ఆమె కాళ్లు, చేతులపై పలుమార్లు పొడిచాడు. నేరం చేసిన తర్వాత మంజునాథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.తన సంబంధాన్ని తన తండ్రి వ్యతిరేకించడంతో అతని చిన్న కుమార్తె కూడా పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. బెంగళూరు రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం, వారం క్రితం చిన్న కుమార్తె ప్రేమ విషయం తెలిసి ఆయన వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం కాస్త పోలీసుల వద్దకు వెళ్లింది.
చెల్లి లాగే అక్క
తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చిన్న కుమార్తె స్పష్టం చేయడంతో పోలీసులు ఆమెను సంరక్షణా కేంద్రానికి తరలించారు. తాజాగా కవన వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించానని మంజునాథ్‌కు చెప్పింది. పెళ్లి కుదరదంటూ ఆయన తెగేసి చెప్పారు. ఇద్దరు కుమార్తెలూ ప్రేమ అంటూ పరువు తీస్తున్నారని రగిలిపోయిన మంజునాథ్ ఈ హత్య చేశారని ఎస్పీ తెలిపారు.