మధ్యప్రదేశ్‌లో ఘోరం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. అతని తల్లిని వివస్త్రను చేసి..
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బరోడియా నౌంగర్ గ్రామంలో ఘోరం జరిగింది. 20ఏళ్ల దళిత యువకుడు నితిన్ అహిర్వార్ ఇంట్లోకి చొరబడి అతన్ని దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత అతని తల్లిని వందలాది ముందు బట్టలు విప్పి దారుణంగా అవమానించారు. ఇంతకీ ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో నిందితుడు విక్రమ్ సింగ్ (28) నితిన్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు నితిన్ అహిర్వార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విక్రమ్‌తో పాటు అతని స్నేహితులపై కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ఆ కేసును ఉపసంహరించుకోవాలని నితిన్ కుటుంబ సభ్యులను భయపెట్టడానికి విక్రమ్ ప్రయత్నించాడు. కానీ నితిన్ కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు.
తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
దీంతో విక్రమ్ సింగ్ అనుచరులతో కలిసి నితిన్ ఇంటిపై దాడికి తెగబడ్డాడు. నితిన్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. నితిన్‌ను రక్షించడానికి తల్లి రాగా, అమెను దుండగులు వివస్త్రను చేశారు. అలాగే నితిన్ సోదరిని కూడా తీవ్రంగా కొట్టారు. అనంతరం విక్రమ్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నితిన్ బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించగా, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వేధింపుల కేసులో రాజీకి రాకపోవడం వల్లే తన సోదరుడిని కొట్టి చంపారని నితిన్ సోదరి విలేకరులతో చెప్పింది.