Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు డిజిటల్ యాడ్స్ కోసం భారీగా ఖర్చు చేసాయి. ముఖ్యంగా మెటా( ఫేస్‌బుక్, ఇన్‍స్టా), గూగుల్ యాడ్స్ కోసం ఆయా పార్టీలు ఓ రేంజ్‌లో ప్రకటనలు ఇచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ నెలలో డిజిటల్ యాడ్స్ కోసం ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందనే అంశంపై 'హిందుస్థాన్ టైమ్స్' ఓ నివేదికలను విడుదల చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్‌లో మెటా( ఫేస్‌బుక్, ఇన్‍స్టా) ప్లాట్‌ఫారమ్‌లలో 7,901 ప్రకటనల కోసం టాప్-20 రాజకీయ ప్రకటనదారులు రూ.5.98 కోట్లు ఖర్చు చేశారు.
కాంగ్రెస్ రూ.14.3 కోట్లు, బీఆర్ఎస్ రూ.12.1 కోట్లు
అదే నవంబర్‌లో గూగుల్ యాడ్స్ కోసం రూ.36.31 కోట్లను వెచ్చించారు. గత నెల మొత్తం 15,405 రాజకీయ ప్రకటనలు గూగుల్‌లో ప్రచురితమయ్యాయి. అటు గూగుల్, ఇటు మెటాలో టాప్ -20 రాజకీయ ప్రకటనదారులను పోల్చి చూస్తే కాంగ్రెస్ టాప్‌లో ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ శాఖలు నేరుగా రు.2.58 కోట్ల ప్రకటనలు ఇవ్వగా.. ఆ పార్టీ అభిమానులు రూ.2.24 కోట్ల విలువైన యాడ్స్ ప్రచురించారు. ఇక గూగుల్స్ యాడ్స్‌లోనూ కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది. కాంగ్రెస్ రూ.14.3 కోట్లు, భారత రాష్ట్ర సమితి రూ.12.1 కోట్లు, బీజేపీ రూ.4.16 కోట్లు ఖర్చు చేసింది.
వాస్తవానికి బీఆర్ఎస్ ఖర్చే ఎక్కువ.. కానీ..
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒక రాష్ట్రంలో పోటీ చేసిన బీఆర్ఎస్ రూ.12.1కోట్లు ఖర్చు చేస్తే.. ఐదు రాష్ట్రాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ రూ.14.3కోట్లు వెచ్చించడం గమనార్హం. వాస్తవానికి డిజిటల్ యాడ్స్‌లో బీఆర్ఎస్ టాప్ అని చెప్పాలి. కానీ లెక్కల పరంగా చూస్తే కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు చేసింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంత తక్కువ మొత్తంలో డిజిటల్ యాడ్స్ ఇచ్చిందా? అనే ప్రశ్న రావొచ్చు. అయితే బీజేపీ డిజిటల్ యాడ్స్ కంటే.. సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌పైనే ఫోకస్ పెట్టింది. మీమ్‌లు, కౌంటర్ వీడియోల ద్వారా బాగా ప్రజల్లోకి వెళ్లింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆన్‌లైన్ ప్రకటనల్లో ఎక్కువ భాగం నవంబర్ నెలలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనే ఖర్చు చేసారు.