దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు భారత్ దిగింది. నిజ్జర్ హత్య ఉదంతం నేపథ్యంలో భారతీయ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కెనడా టాప్ రాయబారిని భారత్ బహిష్కరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మంగళవారం ఉదయం కెనడా హైకమిషనర్‌ను భారత్‌లోని కెనడియన్ దౌత్యవేత్తను పిలిపించింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఈఏ ఆ దేశ రాయబారికి తెలిపింది. ఐదు రోజుల్లో భారతదేశం విడిచిపెట్టాలని కెనడా దౌత్యవేత్తకు ఎంఈఏ సమన్లు జారీ చేసింది.