Uttarakhand Landslide: రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడటం సాధారణమైపోయింది.ఇది ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పెద్ద ముప్పుగా మారుతోంది. వర్షాల వల్ల ట్రాఫిక్ కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. తాజాగా, సోన్‌ప్రయాగ్ - గౌరీకుండ్ రహదారిపై కొండచరియల శిధిలాలు పడటంతో ఒకరు మృతి చెందారు, ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ ప్రకారం, సోమవారం రాత్రి 7:20 గంటలకు సోన్‌ప్రయాగ్, ముంకతీయ మధ్య రహదారిపై శిధిలాలు పడటంతో కొంతమంది ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం అందింది.
చీకటి, వర్షం కారణంగా కొంత ఇబ్బందులు
వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్,సెక్టార్ మెజిస్ట్రేట్‌లను ఘటనా స్థలానికి పంపించారు. సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని, శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ముగ్గురిని సోన్‌ప్రయాగ్ ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే చీకటి, వర్షం కారణంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక సిబ్బంది ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో కృత్రిమ లైట్లు ఏర్పాటు చేశారు.
2 రోజులుగా ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఇటీవల 2 రోజులుగా ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పర్వతాలు విరిగిపడటం, నదులు ఉప్పొంగి ప్రవహించడం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం పెరుగుతోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నప్పటికీ, కొన్ని ప్రమాదాలు తప్పట్లేదు.