Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతుల్లో గుజరాత్‌కు చెందిన ముగ్గురు భక్తులు, హరిద్వార్‌కు చెందిన ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదో బాధితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు బాధితులు కేదార్‌నాథ్‌కు వెళుతుండగా గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వారి మృతదేహాలను శుక్రవారం వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
60 మీటర్ల హైవే ధ్వంసం
తర్సలిలో కొండపై నుంచి భారీ బండరాళ్ల శిలలు పడటంతో కేదార్‌నాథ్‌గ్యా హైవే 60 మీటర్ల వరకు ధ్వంసమైంది. బండరాళ్లన్నీ ఒక్కసారిగా కారుపై పడటంతో అందరూ అక్కడిక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రుద్రప్రయాగతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రవాణా స్తంభించిపోయింది. పలువురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని చాలా జిల్లాల్లో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14 వరకు అతి భారీ వర్షాల కారణంగా 'రెడ్' అలర్ట్, 'ఆరెంజ్' అలర్ట్‌లను వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కొద్దిరోజుల క్రితం కొండచరియలు విరిగిపడి ఒక వ్యక్తి గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించారు.