LOADING...
Bengal Election: బెంగాల్‌లో పెరిగిన పోలింగ్‌ శాతం.. గెలుపు ఎవరిది?
బెంగాల్‌లో పెరిగిన పోలింగ్‌ శాతం.. గెలుపు ఎవరిది?

Bengal Election: బెంగాల్‌లో పెరిగిన పోలింగ్‌ శాతం.. గెలుపు ఎవరిది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాతరను తలపించేలా ప్రజలు తండోపతండాలుగా పోలింగ్‌ బూత్‌లకు చేరుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటివరకు బెంగాల్‌లో మూడు ప్రధాన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి—కాంగ్రెస్‌, వామపక్షాలు, ప్రస్తుతం అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్. అయితే ఈ మూడు దశల్లో ఏ ఎన్నికలలోనూ ఇంత భారీ స్థాయిలో పోలింగ్‌ నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గురువారం 152 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. దాదాపు 92.88 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం.

వివరాలు

గత ఎన్నికల్లో పోలిస్తే 10శాతం ఎక్కువ

ఇది గత ఎన్నికలతో పోలిస్తే సుమారు 10 శాతం ఎక్కువ. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా ('సర్') అంశంపై వివాదం చెలరేగింది. అర్హుల ఓట్లు తొలగించారంటూ టీఎంసీ ఆరోపించింది. అయితే ఈసారి ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను మోహరించడంతో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటేశారు. కొత్త ఓటర్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటు వేయకపోతే పేరు తొలగిస్తారనే ప్రచారం కూడా భారీగా సాగడంతో ఓటర్లు మరింతగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చినట్లు తెలుస్తోంది. 2011లో మమతా బెనర్జీ వామపక్షాల కంచుకోటను చెరిపేసి అధికారంలోకి వచ్చారు.

వివరాలు

92శాతానికి పైగా పోలింగ్

ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2016లో తృణమూల్‌ కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రాగా, బీజేపీ 59 స్థానాలు సాధించింది. 2021లో మమత మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ఎన్నికల్లో బీజేపీ 92 స్థానాలు గెలిచి బలమైన సవాలు విసిరింది. ఇప్పుడు తాజా ఎన్నికల్లో 92 శాతానికి పైగా పోలింగ్‌ నమోదవడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. పెరిగిన ఓటింగ్‌ శాతం ఎవరికీ అనుకూలంగా మారుతుందన్నదే చర్చనీయాంశమైంది. మమత బెనర్జీకి కలిసొస్తుందా? లేక బీజేపీకి మేలు చేస్తుందా? అన్నది మే 4న వెల్లడయ్యే ఫలితాలతో తేలనుంది.

Advertisement