NarendraModi: 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధించారు- మనం దేశాన్ని సుసంపన్నం చేయలేమా
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు, ప్రధాని మోదీ త్రివిధ సాయుధ దళాలు, భారత సైన్యం, భారత నావికాదళం, భారత వైమానిక దళం, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS), ఢిల్లీ పోలీసుల సంయుక్త గార్డ్ ఆఫ్ హానర్ (సెల్యూట్) తీసుకున్నారు. మే 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా 11వ సారి ఎర్రకోట ప్రాకారంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ప్రధాని మోదీ.
దేశాన్ని అభివృద్ధి చేయడమే కల - మోదీ
దేశప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు జనాభా పరంగా కూడా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఇంత పెద్ద మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నేడు స్వాతంత్య్ర పండుగ జరుపుకుంటున్నారని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేయడమే మా ధ్యేయమన్నారు. 40 కోట్ల మంది ప్రజలు దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వగలిగితే, 140 కోట్ల మంది దేశస్థులు కూడా దేశాన్ని సుసంపన్నం చేయగలరన్నారు.
ఈ ప్రత్యేక విజయాన్ని ప్రధాని మోదీ పేరిట నమోదైంది
జెండా ఎగురవేయడంతో ప్రధాని మోదీ పేరిట ఓ ప్రత్యేకత నమోదైంది. వరుసగా 11 సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన దేశానికి రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ విషయంలో ఎర్రకోటపై నుంచి వరుసగా 10 సార్లు జెండా ఎగురవేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందున్నారు. ఈ విషయంలో, 1947 నుండి 1963 వరకు 17 సార్లు ఈ ఘనత సాధించిన భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు.
దిల్లీలో గట్టి భద్రతా ఏర్పాట్లు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భద్రతను పటిష్టం చేసేందుకు ఢిల్లీ పోలీసులు 3,000 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, 10,000 మందికి పైగా పోలీసులతో పాటు AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ CCTV కెమెరాలను మోహరించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు మరియు బస్టాండ్లు, వాణిజ్య మాల్స్, మార్కెట్లు, ఇతర ప్రధాన మార్గాలలో పారామిలటరీ బలగాలను మోహరించారు. ఎర్రకోట వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలపై మాట్లాడిన ప్రధాని మోదీ
దేశ వ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేసిన ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల పరంపర గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. "ఈ రోజు, నేను బాధితులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో మేము వారితో పాటు నిలబడతామని వారికి హామీ ఇస్తున్నాను" అని అయన చెప్పారు. గత నెలలో కేరళలోని వాయనాడ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
'నేషన్ ఫస్ట్' నినాదం
'నేషన్ ఫస్ట్' నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజల జీవితాలను మార్చే లక్ష్యంతో ప్రాథమిక మార్పులను అమలు చేయాలని నిర్ణయించింది. "ఈ సంస్కరణలు కేవలం తాత్కాలిక దృష్టి కోసం కాదని, అవి దేశాన్ని బలోపేతం చేయడానికి రూపొందించబడ్డాయి అని నేను ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను నమ్మకంగా చెప్పగలను..., అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నాం" అని పేర్కొన్నారు.
విక్షిత్ భారత్ 2047 కోసం, దేశస్థుల నుండి సూచనలు ఆహ్వానించబడ్డాయి
2047 నాటికి 'విక్షిత్ భారత్'గా మారాలన్న తన ప్రభుత్వ లక్ష్యంపై, ప్రభుత్వం దేశప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిందని చెప్పారు. కొంతమంది భారత్‌ను స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలని సూచించగా, మరికొందరు భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాలని, దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని సూచించారు. "పరిపాలన, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, గ్రీన్‌ఫీల్డ్ నగరాల సృష్టి, సామర్థ్యం పెంపుదల, భారతదేశం స్వంత అంతరిక్ష కేంద్రం- ఇవి పౌరుల ఆకాంక్షలు"
10 కోట్లమంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారు: ప్రధాని
ఊహించినట్లుగానే, ప్రధాని మోదీ ప్రసంగంలో మహిళలతో సహా దేశం కోసం తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. గత పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ఆర్థిక స్వాతంత్య్రం సాధించారన్నారు. "మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారినప్పుడు, వారు ఇంటిలో నిర్ణయాత్మక వ్యవస్థలో భాగం అవుతారు, ఇది సామాజిక మార్పుకు దారి తీస్తుంది." స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు 9 లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు.
శక్తివంతంగా మారుతున్న అంతరిక్ష రంగం: ప్రధాని
తమ ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిందని, దీని వల్లే అనేక స్టార్టప్‌లు ఈ రంగంలోకి వస్తున్నాయని చెప్పారు. "భారత్‌ను శక్తిమంతమైన దేశంగా మార్చేందుకు అంతరిక్ష రంగం చాలా ముఖ్యమైన అంశం. దీర్ఘకాలిక ఆలోచనతో ఈ రంగానికి మేము దృష్టి సారిస్తున్నాము, బలాన్ని అందిస్తున్నాము" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది భారతదేశ స్వర్ణయుగం: ప్రధాని మోదీ
ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది భారతదేశానికి స్వర్ణయుగమని అన్నారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ప్రతి రంగంలోనూ కొత్త ఆధునిక వ్యవస్థలు నిర్మించబడుతున్నాయి.