Renewable Energy: దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 జనవరి 31 వరకు అన్ని ఉత్పత్తి మార్గాలను కలిపి నికరంగా 52,537 మెగావాట్ల అదనపు సామర్థ్యం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ఇందులో 39,657 మెగావాట్లు పునరుత్పాదక ఇంధన విభాగానికి చెందినవని పేర్కొంది. ఈ పునరుత్పాదక సామర్థ్యంలో సౌర విద్యుత్తు నుంచే 34,955 మెగావాట్లు, పవన విద్యుత్తు ద్వారా 4,613 మెగావాట్లు జతయ్యాయని వివరించింది.
వివరాలు
దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,20,510.95 మెగావాట్లకు..
గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంవత్సరంలో సాధించిన 34,054 మెగావాట్ల సామర్థ్యంతో పోలిస్తే ఈ పెరుగుదల 54.27 శాతం అధికమని స్పష్టం చేసింది. తాజా పెరుగుదలతో దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,20,510.95 మెగావాట్లకు చేరిందని కేంద్రం తెలిపింది. ఇందులో శిలాజ ఆధారిత ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయ్యే సామర్థ్యం 2,48,541.62 మెగావాట్లుగా ఉండగా, శిలాజేతర ఇంధనాల సామర్థ్యం 2,71,969.33 మెగావాట్లుగా నమోదైందని పేర్కొంది. శిలాజేతర విభాగంలో అణు విద్యుత్తు సామర్థ్యం 8,780 మెగావాట్లు కాగా, పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయ్యే సామర్థ్యం మొత్తం 2,63,189.33 మెగావాట్లుగా ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.