Loading...
Delhi Rain Postpones Protest: వర్షం కారణంగా ఇండియా కూటమి కీలక నిర్ణయం.. 'పబ్లిక్ అభిశంసన' కార్యక్రమం వాయిదా
వర్షం కారణంగా ఇండియా కూటమి కీలక నిర్ణయం.. 'పబ్లిక్ అభిశంసన' కార్యక్రమం వాయిదా

Delhi Rain Postpones Protest: వర్షం కారణంగా ఇండియా కూటమి కీలక నిర్ణయం.. 'పబ్లిక్ అభిశంసన' కార్యక్రమం వాయిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించాల్సిన 'పబ్లిక్‌ అభిశంసన' కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అదే వేదికపై నిర్వహించాలని ప్రతిపక్ష కూటమి నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (CEC)జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రతిపక్ష పార్టీలు చేపట్టనున్న ఈ కార్యక్రమం.. ఓటు చోరీ ఆరోపణలపై నిరసనలో భాగంగా నిర్వహించనున్నారు. ఢిల్లీలోని సెంట్రల్‌ ఢిల్లీలో రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే అధికారిక నివాస ప్రాంగణంలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే శుక్రవారం ఉదయం నుంచి రాజధానిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాయిదా వేయాల్సి వచ్చింది.

వివరాలు

మీరా కుమార్‌  అధ్యక్షతన సభ

మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చివరగా ప్రసంగించనున్నట్లు సమాచారం.

ఖర్గే నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష కూటమిలోని ప్రతి పార్టీ నుంచి ఒకరు చొప్పున మాట్లాడే అవకాశం ఉంది.

వివరాలు

గురువారం తుది ఏర్పాట్లపై ప్రతిపక్ష నేతల భేటీ

'ఓటు చోరీ' అంశంపై నిరసనలో భాగంగా ఈ ప్రతీకాత్మక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు.

ఇందులో భాగంగా గురువారం ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమై కార్యక్రమానికి సంబంధించిన తుది ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, సీనియర్‌ నేత మీరా కుమార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరిక్‌ ఓబ్రియన్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత హరేంద్ర మాలిక్‌, జేఎంఎం నేత మహువా మాజి, సీపీఎం నేత జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖర్గే, రాహుల్‌ గాంధీలతో పాటు ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ తరఫున ఒక ప్రతినిధి ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

నవంబర్‌ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ నిరసన

సీఈసీపై 'పబ్లిక్‌ అభిశంసన' కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్‌ మంగళవారం ఆరోపించింది.

ఎన్నికల వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత, సామాన్య ప్రజల గొంతును కూడా ప్రభుత్వం నొక్కేయాలని చూస్తోందని విమర్శించింది.

ఇదిలా ఉండగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision - SIR)ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ADVERTISEMENT