Loading...
India-Nepal: నేపాల్‌ అభివృద్ధికి రూ.24 వేల కోట్ల సాయం ప్రకటించిన మోదీ
నేపాల్‌ అభివృద్ధికి రూ.24 వేల కోట్ల సాయం ప్రకటించిన మోదీ

India-Nepal: నేపాల్‌ అభివృద్ధికి రూ.24 వేల కోట్ల సాయం ప్రకటించిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌,నేపాల్‌ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్‌ ప్రధాని బలేంద్ర షా (బాలెన్‌ షా) చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక, ప్రతినిధి బృందాల స్థాయి సమావేశాలు నిర్వహించారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నేపాల్‌ అభివృద్ధికి భారత్‌ రూ.24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్యాకేజీని అందించనున్నట్లు ప్రకటించారు. ఆ దేశ అభివృద్ధికి భారత్‌ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌,నేపాల్‌ మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైనవే కాదని, శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, ప్రజల మధ్య ఉన్న అనుబంధంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

శ్రీరాముడు,సీతాదేవితో ముడిపడిన భారత్‌-నేపాల్‌ ఆధ్యాత్మిక బంధం

భారత్‌, నేపాల్‌ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని ప్రస్తావిస్తూ.. శ్రీరాముడు, సీతాదేవి ఇరు దేశాలను మరింత దగ్గర చేశారని మోదీ అన్నారు.

భారత ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో నేపాల్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.

నేపాల్‌ లేకుండా భారతదేశ తీర్థయాత్రల ప్రస్థానం, శ్రీరాముడి కథ పూర్తికావని వ్యాఖ్యానించారు.

అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని మోదీ తెలిపారు.

2025లో ఏకంగా 30 కోట్ల మంది భక్తులు రామమందిరాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.

సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్‌తో అయోధ్యను అనుసంధానించే రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఈ రైలు సేవతో ఇరు దేశాల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

నేపాల్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు..

నేపాల్‌ విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు మోదీ వెల్లడించారు.

ముఖ్యంగా న్యాయశాస్త్రం, సాంకేతిక రంగాల్లో చదువుకునే నేపాల్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల సంఖ్యను పెంచుతామని తెలిపారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ చేరుకున్న నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షాకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది.

అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఉంచి గౌరవం ప్రకటించారు.

ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

మోదీ.. త్రివేణి సంగమం నుంచి సేకరించిన గంగాజలాన్ని బాలెన్‌ షాకు అందించారు.

దీనికి ప్రతిగా బాలెన్‌ షా.. పశుపతినాథ్‌ ఆలయానికి చెందిన రుద్రాక్షలు, చందనాన్ని మోదీకి బహూకరించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌ అభివృద్ధికి భారత్‌ భారీ ప్యాకేజీ..  

ADVERTISEMENT