Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన.. జూలై 30న ఇండియా బ్లాక్ ర్యాలీ
ఈ వార్తాకథనం ఏంటి
తీహార్ జైలులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందనే అంశంపై జూలై 30న ఇండియా బ్లాక్ జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించనుంది.
జైల్లో ఉన్న కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
సీఎం మెడికల్ రిపోర్టును ఉటంకిస్తూ.. జూన్ 3 నుంచి జూలై 7 వరకు కేజ్రీవాల్ షుగర్ లెవల్ 26 సార్లు పడిపోయిందని పార్టీ పేర్కొంది.
కేజ్రీవాల్ జీవితంతో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆడుకుంటున్నారని ఇండియా బ్లాక్ ఆరోపిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ, 'కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందనే విషయాన్నిలేవనెత్తేందుకు ఇండియా బ్లాక్ జంతర్ మంతర్ వద్ద జూలై 30న భారీ ర్యాలీ నిర్వహిస్తుంది' అని చెప్పారు.
వివరాలు
సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 8 వరకు పొడిగింపు
లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.
ఢిల్లీ సీఎంకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. అయితే ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రూస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనని హాజరుపరిచారు.
అదే సమయంలో, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో,ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆప్ నేత మనీష్ సిసోడియా,బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితలకు జ్యుడీషియల్ కస్టడీని జూలై 31 వరకు పొడిగించింది.