ముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆదివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో మెగా ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ ర్యాలీ ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి బలప్రదర్శనగా జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. శివాజీ పార్కు వేదికగా ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనుంది. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజుల పాటు సాగింది. శనివారం ముంబైలోకి ప్రవేశించింది. సెంట్రల్ ముంబైలోని చైత్యభూమిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి.. "రాజ్యాంగ ప్రవేశిక" చదవడం ద్వారా యాత్రను ఆయన ముగించారు.
ర్యాలీకి ఎవరు వస్తున్నారు?
శివాజీ పార్క్‌లో నిర్వహిస్తున్న మెగా ర్యాలీకి రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ ర్యాలీకి హాజరవుతారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), తేజస్వీయ్ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్) వస్తున్నారు. ఇండియా కూటమి ర్యాలీకి ముందు, రాహుల్ ఆదివారం ముంబైలోని మణి భవన్ నుంచి క్రాంతి మైదాన్‌కు న్యాయ్ సంకల్ప్ పాదయాత్రను చేపట్టనున్నారు. మహాత్మా గాంధీ ముంబైకి వచ్చినప్పుడల్లా మణి భవన్‌లో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీని తేజ్‌పాల్ హాల్‌లో డిసెంబర్ 28, 1885న ప్రకటించారు.