భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. 1962లో భారతదేశం తన భూభాగాన్ని రక్షించుకోవడానికి చైనాతో యుద్ధానికి దిగిందని, 2020లో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చైనా ఆక్రమించుకుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. ఫలితంగా భారత్ వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోయిందన్నారు. అందుకే ఆ రెండు ఘటనల మధ్య పోలిక లేదన్నారు. లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకోసం 'Deny, Distract, Lie and Justify(డీడీఎల్‌జే)' వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు.
మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్‌పై ఆరోపణలు: రమేశ్
ప్రాదేశిక పరాభవాన్ని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం 'తిరస్కరించడం, దృష్టిని మరల్చడం, అబద్ధం చెప్పడం, సమర్థించడం(డీడీఎల్‌జే)' వ్యూహంతో ముందుకెళ్తోందన్నారు జైరామ్ రమేష్. మోదీ ప్రభుత్వ వైఫల్యం నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారన్నారు. 2017లో చైనా రాయబారితో రాహుల్ గాంధీ భేటీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై జైరామ్ రమేష్ ఘాటుగా స్పందించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి భారత రాయబారి అయిన జైశంకర్ ప్రతిపక్ష రిపబ్లికన్ నేతలను ఎలా కలిశారని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులకు దౌత్యవేత్తలను కలిసే అర్హత లేదని స్పష్టం చేశారు.