California Hindu temple: స్వామి నారాయణ్ ఆలయంపై విద్వేష దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో గల చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం దాడి చేశారు.
ఆలయ గోడలపై భారతదేశాన్ని వ్యతిరేకించే రాతలను రాశారు. గ్రాఫిటీ ద్వారా ఆలయాన్ని అపవిత్రం చేయాలని యత్నించారు.
ఈ దాడి ఖలిస్తానీ వాదుల పనే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. చినో హిల్స్ ప్రాంతం లాస్ ఏంజెలెస్ కౌంటీ సమీపంలోనే ఉంది.
ఆలయ అపవిత్రతపై బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ (BAPS) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
వివరాలు
దాడిపై తీవ్ర నిరసన
"హిందూ దేవాలయాలపై విద్వేష దాడులను హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు ఈ విద్వేషాన్ని అరికట్టడానికి కలిసికట్టుగా ముందుకు వస్తారు." అని సంస్థ 'ఎక్స్' (మాజీ ట్విట్టర్)లో పేర్కొంది.
ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దుండగులపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని FBIని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (COHNA) అమెరికా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
వివరాలు
ఇప్పటివరకు 10 ఆలయాలపై దాడులు
"అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని కొందరు మీడియా, మేధావులు చెబుతున్నా... వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో స్వామి నారాయణ్ ఆలయంపై దాడి జరగడం యాదృచ్ఛికం కాదని భావించాలి." అని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
గత కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి.
2023లో కాలిఫోర్నియాలోని శాక్రమెంటో, న్యూయార్క్‌లోని మెల్‌వీల్ ప్రాంతాల్లో ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలు నమోదయ్యాయి.
అప్పట్లో "హిందూస్ గో బ్యాక్" అనే రాతలను ఆలయ గోడలపై రాసి హిందువుల మనోభావాలను కించపరిచారు.
వివరాలు
భారత ప్రభుత్వం తీవ్ర ఖండన
ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు.
అమెరికాలోని హిందూ దేవాలయాలకు సరైన రక్షణను అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భారత కాంగ్రెస్ పార్టీ కూడా ఆలయ అపవిత్రతను తీవ్రంగా ఖండించింది.
హిందూ దేవాలయాలపై అసహనం, విద్వేష దాడులు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది.
దుండగులపై అమెరికా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ దాడిని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కూడా తీవ్రంగా ఖండించారు.