Hardeep Singh Puri: 'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా తాము ప్రపంచానికి మేలు చేశామని, అలా చేయకుంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేవి అని ఆయన తెలిపారు.
చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు
''రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ యావత్ ప్రపంచానికి మేలు చేసింది. ఒకవేళ మేం అలా చేయకుంటే, చమురు ధరలు ఆకాశాన్నంటేవి, బ్యారెల్ ధర 200 డాలర్లను చేరేవి. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ధరల పరిమితి మాత్రమే ఉంది, దాన్ని భారతీయ సంస్థలు కూడా అనుసరిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఆంక్షలు పడే అవకాశముందని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ అదే సమయంలో, ఐరోపా, ఆసియాకు చెందిన చాలా దేశాలు రష్యా నుంచి బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు, డీజిల్, ఎల్‌ఎన్‌జీ, అరుదైన ఖనిజాలను కొనుగోలు చేశారన్న విషయాన్ని మర్చిపోకూడదు'' అని ఆయన పేర్కొన్నారు.
లాభం చేకూరే చోట నుండి ఇంధన కొనుగోళ్లు
"ధరల పరంగా మన చమురు సంస్థలకు లాభం చేకూరే చోట నుండి ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తాం. మన పౌరులకు అందుబాటు ధరల్లో స్థిరమైన ఇంధన వనరులను అందించడమే తమ అగ్ర ప్రాధాన్యం. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గత మూడేళ్లుగా ఇంధన ధరలు తగ్గుతున్న ఏకైక దేశం మనదే" అని హర్దీప్ సింగ్ పురి అన్నారు.