Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాక్ కన్నా 20 ఎక్కువ: 'సిప్రి' నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశం వద్ద మొత్తం 190అణు వార్‌హెడ్లు ఉన్నట్లు స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ 10 అణ్వాయుధాలను పెంచుకోగా,పాకిస్థాన్ కంటే 20 వార్‌హెడ్లు అధికంగా ఉన్నాయని పేర్కొంది. సిప్రి నివేదిక ప్రకారం,చైనా,పాకిస్థాన్‌లలోని సుదూర లక్ష్యాలను సైతం ఛేదించేలా భారత్ తన అణ్వస్త్ర వ్యవస్థలను ఆధునికీకరిస్తోంది. మారుతున్న భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీర్ఘశ్రేణి సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ కూడా తన అణ్వాయుధ నిల్వలను విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని పేర్కొంది.
వివరాలు
ప్రపంచ అణ్వాయుధ దేశాల జాబితాలోమొదటి స్థానంలో రష్యా ..
ప్రపంచ అణ్వాయుధ దేశాల జాబితాలో చైనా వద్ద 620 అణు వార్‌హెడ్లు ఉన్నట్లు సిప్రి వెల్లడించింది. అత్యధిక అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉండగా,ఆ దేశం వద్ద 5,420 వార్‌హెడ్లు ఉన్నాయి. అమెరికా 5,042 అణ్వాయుధాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉండగా, వాటి వద్ద కలిపి 12 వేలకుపైగా అణు వార్‌హెడ్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
వివరాలు
రక్షణ రంగంలోనూ బలాన్ని పెంచుకుంటున్న భారత్
ఈ జాబితాలో ఫ్రాన్స్ వద్ద 370, యూకే వద్ద 225, ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 60 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధ సామర్థ్యంతో పాటు రక్షణ రంగంలోనూ భారత్ తన బలాన్ని పెంచుకుంటోంది. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.8.75 లక్షల కోట్లకు చేరినట్లు సిప్రి నివేదిక తెలిపింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.9 శాతం అధికం. అలాగే 2021-25 మధ్య ప్రపంచ రక్షణ దిగుమతుల్లో 8.2 శాతం వాటా భారత్‌దేనని నివేదిక స్పష్టం చేసింది.