
cough syrups: భారత్‌లో తయారైన 3 దగ్గు సిరప్‌ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్ నివేదిక, మార్కెట్ నుంచి ఉపసంహరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్‌లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. ఈ విషయం గురించి భారత్ బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి అధికారికంగా సమాచారం అందించింది. తెలంగాణ,తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్,రెడ్‌నెక్స్ ఫార్మా,షేప్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన కోల్డ్రిఫ్ (Coldrif),రెస్పిఫ్రెష్ TR (Respifresh TR),రీలైఫ్ (ReLife) పేర్లతో ఉన్న సిరప్‌లలో డయిథిలీన్ గ్లైకాల్ (DEG) అనే ప్రమాదకర రసాయనం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తేలింది. ఈ DEG రసాయనం సాధారణంగా యాంటీఫ్రీజ్(Antifreeze)లు, పరిశ్రమలలో ఉపయోగించే రసాయన ఉత్పత్తుల్లో వాడతారు. కానీ ఇది మనిషి శరీరంలోకి వెళితే తీవ్రమైన కిడ్నీ సమస్యలు, నాడీ సమస్యలు లేదా మరణానికి కూడా దారితీస్తుంది.
వివరాలు
కోల్డ్రిఫ్‌లో 48.6శాతం DEG
కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ(CDSCO)ఈ సిరప్‌లలో DEG ఉనికిని ధృవీకరించింది. ఈ సిరప్‌లు పిల్లల్లో తలనొప్పి, వాంతులు, మూత్ర సంబంధిత సమస్యలు వంటి లక్షణాలతో బయటపడిన కొన్ని కేసులతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఈ మూడు ఉత్పత్తులను పూర్తిగా మార్కెట్ నుంచి ఉపసంహరించి, ఆయా కంపెనీలకు భవిష్యత్తులో ఎలాంటి ఔషధ ఉత్పత్తులు తయారు చేయకుండా నిషేధం విధించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో 20మంది చిన్నారులు మరణించిన ఘటన తరువాత ఈ సిరప్‌లపై దృష్టి పడింది. పరిశీలనలో కోల్డ్రిఫ్‌లో అత్యంత ప్రమాదకరంగా 48.6శాతం DEG ఉన్నట్లు తేలగా,రెస్పిఫ్రెష్ TRలో 1.34 శాతం,రీలైఫ్‌లో 0.616 శాతం DEG గుర్తించబడింది. ఈ మోతాదులు చిన్నారుల ప్రాణాలను తీసేంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు.
వివరాలు
WHO-భారత్ మధ్య కొనసాగుతున్న దర్యాప్తు
ఈ ఘటనపై WHO అక్టోబర్ 1న భారత్‌ను సంప్రదించింది. మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లోని పిల్లల్లో కిడ్నీ వైఫల్యం,మెదడు వాపు వంటి లక్షణాలు కనిపించాయని,వాటికి ఈ సిరప్‌లు కారణమని అనుమానం వ్యక్తమైంది. WHO భారత్ ప్రభుత్వాన్ని ఈ సిరప్‌లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయా? అనే అంశంపై వివరణ కోరింది. దీనికి స్పందించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ,ఈ కలుషిత సిరప్‌లు దేశం బయటకు ఎగుమతి కాలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా,ఆ ఉత్పత్తుల తయారీని పూర్తిగా నిలిపివేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక DEG కలుషితానికి కారణం ఇంకా ఖచ్చితంగా తెలియకపోయినా, WHO మాత్రం ఇలాంటి నాణ్యతలేని మందులు నియంత్రణ లేని మార్గాల ద్వారా ప్రపంచ మార్కెట్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివరాలు
స్పందించిన భారత్ ప్రభుత్వం
ఈ ఘటనల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలోని మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలోని ఔషధ తయారీ యూనిట్లలో తనిఖీలు ప్రారంభించింది. ప్రజారోగ్యాన్ని రక్షించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని మంత్రిత్వశాఖ హామీ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తి నాణ్యతను కాపాడే దిశగా భారత్ తీసుకున్న ఈ చర్యలను WHO స్వాగతించింది. భారతదేశ ప్రజారోగ్య రక్షణలో తాము పూర్తి సహకారం అందిస్తామని, ఈ ఘటనలపై జరుగుతున్న దర్యాప్తులో సహకరిస్తామని WHO ప్రకటించింది.