Fuel: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 60 రోజులకు సరిపడా స్టాక్: కేంద్రం క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెట్రోల్,డీజిల్, ఎల్‌పీజీ కొరత ఉందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఎలాంటి ఇంధన సంక్షోభం లేదని స్పష్టంచేసింది. ప్రస్తుతానికి 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూల్లో నిలబడుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు అపోహలకు గురి కాకూడదని సూచించింది.
వివరాలు
భారత్ స్థానం ప్రపంచంలో..
ప్రపంచస్థాయిలో భారత్ కీలక ఇంధన కేంద్రంగా ఉందని కేంద్రం గుర్తుచేసింది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా, ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారత్ నిలిచిందని తెలిపింది. దేశీయ అవసరాలను తీరుస్తూనే 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని వెల్లడించింది. దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
వివరాలు
చమురు నిల్వలపై వివరాలు
దేశంలో ప్రస్తుతం చమురు కంపెనీల వద్ద 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వ్యూహాత్మక నిల్వలను కలిపి చూస్తే మొత్తం 74 రోజుల వరకు సరఫరా చేయగల సామర్థ్యం ఉందని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమై ఇప్పటివరకు 27 రోజులు మాత్రమే అయ్యాయని గుర్తు చేసింది. అయినప్పటికీ, భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా రాబోయే రెండు నెలల పాటు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చింది.
వివరాలు
ఎల్‌పీజీ సరఫరాపై స్పష్టత
ఎల్‌పీజీ విషయంలో కూడా ఎలాంటి కొరత లేదని కేంద్రం వెల్లడించింది. దేశీయ ఉత్పత్తిని పెంచడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గిందని తెలిపింది. అవసరమైతే పలు దేశాల నుంచి అదనపు కార్గోలను కూడా తెప్పిస్తున్నామని వివరించింది. ప్రజలకు ఎల్‌పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారంపై హెచ్చరిక ఇంధన కొరతపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, కల్పిత ఆరోపణలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు నిజమైన సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.