LOADING...
India In Talks With Iran: హర్మూజ్‌ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్‌తో భారత్‌ చర్చలు
ఇరాన్‌తో భారత్‌ చర్చలు

India In Talks With Iran: హర్మూజ్‌ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్‌తో భారత్‌ చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వంటగ్యాస్‌ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం, వంటగ్యాస్‌ సరఫరాను పెంచే దిశగా కూడా కసరత్తు చేస్తోంది. భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ ట్యాంకర్ల రాకను సులభతరం చేయడానికి ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్‌కు బయలుదేరిన ఎనిమిది ఎల్పీజీ ట్యాంకర్లు ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్మూజ్‌ జలసంధి వద్ద నిలిచిపోయాయి. ఈ నౌకలను సురక్షితంగా జలసంధిని దాటించేలా చూడటానికి భారత ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది.

వివరాలు 

మూడు మిలియన్‌ బ్యారెళ్ల చమురు భారత్‌కు..

ఈ అంశంపై ఇరాన్‌ అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలంగా మారితే త్వరలోనే ఆ ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధిని దాటి భారత్‌కు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య రెండు చమురు నౌకలు ఇప్పటికే ప్రమాదాన్ని తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాయి. అందులో ఒక నౌక బుధవారం భారత్‌కు చేరుకోగా, మరో నౌక వచ్చే రెండు రోజుల్లో చేరే అవకాశముంది. ఈ రెండు నౌకల ద్వారా కలిపి సుమారు మూడు మిలియన్‌ బ్యారెళ్ల చమురు భారత్‌కు అందుబాటులోకి రానుంది.

వివరాలు 

కేరళలో 40 శాతం హోటళ్లు మూత

ఇక దేశంలో వంటగ్యాస్‌ కొరతపై ఆందోళనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పలు నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు మూతపడటం ప్రారంభమైంది. కేరళలో శుక్రవారం నాటికి సుమారు 40 శాతం రెస్టారెంట్లు పనిచేయడం నిలిపివేశాయి. వంటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో తాత్కాలికంగా వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వస్తోందని రెస్టారెంట్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకుల వద్ద ప్రజలు పెద్దఎత్తున క్యూలలో నిలబడటం మాత్రం ఆందోళనకు కారణమవుతోంది.

Advertisement