Electronics manufacturing projects: ఎలక్ట్రానిక్స్ తయారీలో దూసుకుపోతున్న భారత్.. రూ.41,863 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన 22 నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల అమలుతో రూ.2,58,152 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారయ్యే అవకాశం ఉండగా, సుమారు 33,791 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపింది. ఇదివరకు రూ.12,704 కోట్ల పెట్టుబడి అంచనాలతో 24 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులన్నీ అమల్లోకి వస్తే, కీలకమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కోసం విదేశాలపై భారత్ ఆధారపడటం గణనీయంగా తగ్గనుంది.
Details
దరఖాస్తు చేసిన కంపెనీల్లో టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్
ముఖ్యంగా ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తన తయారీ కార్యకలాపాలను చైనా వెలుపల విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఆ సంస్థకు విడిభాగాలు సరఫరా చేసే కొత్త వెండర్లు కూడా ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈసీఎంఎస్ పథకం కింద తాజాగా దరఖాస్తు చేసిన కంపెనీల్లో టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్, హిందాల్కో ఇండస్ట్రీస్, మదర్‌సన్ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్, శామ్‌సంగ్ డిస్‌ప్లే నోయిడా తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా పీసీబీలు, కెపాసిటర్లు, కనెక్టర్లు, ఎంక్లోజర్లు, లిథియం అయాన్ సెల్స్, కెమేరా మాడ్యూల్స్, డిస్‌ప్లే మాడ్యూల్స్, ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్స్ వంటి కీలక ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ చేపట్టనున్నారు.
Details
పలు రాష్ట్రాల్లో కొత్త యూనిట్లు
ఇవి మొబైల్ తయారీ, టెలికాం, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్, వాహనాలు, ఐటీ హార్డ్‌వేర్ రంగాలకు అవసరమైన భాగాల ఉత్పత్తికి ఉపయోగపడనున్నాయి. రంగాల వారీగా చూస్తే, మొబైల్ తయారీలో వినియోగించే విడిభాగాల తయారీకి రూ.27,166 కోట్ల పెట్టుబడి ప్రతిపాద నలు వచ్చాయి. అలాగే పీసీబీ విభాగంలో రూ.7,377 కోట్లు, లిథియం అయాన్ సెల్ విభాగంలో రూ.2,922 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. ఈ కొత్త యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌తో పాటు హరియాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.