LOADING...
IPL 2026: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐపీఎల్‌ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!
బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐపీఎల్‌ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!

IPL 2026: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐపీఎల్‌ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమ దేశంలో ఐపీఎల్‌ (IPL) ప్రసారాలపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అక్కడ హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఐపీఎల్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) ఫ్రాంఛైజీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 2026 ఐపీఎల్‌ మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్‌, బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.

Details

భారత్‌, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌ కప్

ఈ నిర్ణయానికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తాజాగా తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. ఇదిలా ఉండగా, వచ్చే నెలలో భారత్‌, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌-2026 జరగనుంది. ఈ టోర్నీలో తమ జట్టు మ్యాచ్‌లను భారత్‌ వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో 2026 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ కోసం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు నుంచి బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను మినహాయించాలన్న ఆదేశం బీసీసీఐ నుంచి వెలువడినట్లు సమాచారం అందుతోంది.

Details

తదుపరి నోటీసులు వచ్చేవరకూ ప్రసారాలు నిలిపివేత

భారత క్రికెట్‌ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం వెల్లడించలేదు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌ ప్రజలను తీవ్రంగా బాధించింది. ఈ పరిస్థితుల్లో తదుపరి నోటీసు వచ్చేవరకు ఐపీఎల్‌ ప్రసారాలను నిలిపివేయాలని పేర్కొంది. ఈ పరిణామాలతో భారత్‌-బంగ్లాదేశ్‌ క్రికెట్‌ సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్నట్లు క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement