Andhra Pradesh: పాఠశాల విద్యలో కీలక మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 1-8 తరగతులకు కొత్త సిలబస్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల వరకు పాఠ్యసిలబస్‌లో కీలక మార్పులు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కి అనుగుణంగా ఈ సిలబస్ మార్పులను పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా 1 నుంచి 5 తరగతులకు సంబంధించిన సిలబస్‌లో సుమారు 40 శాతం వరకు మార్పులు చేయనుండగా, 6, 7, 8 తరగతుల్లో మాత్రం పూర్తి సిలబస్‌ను సవరించనున్నారు. ఈ మార్పులకు సంబంధించి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పటికే జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను అమలు చేస్తుండగా, ఇటీవల ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌లో చేసిన మార్పులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా సవరించనున్నారు.
Details
తెలుగు, హిందీ సబ్జెక్టులో పెద్ద మార్పులుండవు
6, 7, 8 తరగతుల్లో తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో పెద్దగా మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే సాంఘిక శాస్త్రంలో మాత్రం చరిత్ర, భౌగోళశాస్త్ర అంశాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా సవరించనున్నారు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే కొనసాగించనున్నారు. ఇక, సిలబస్ మార్పులతో పాటు పరీక్షల్లో ప్రశ్నల విధానంలోనూ కీలక మార్పులు చేపట్టనున్నారు. నేరుగా జవాబులు రాసే విధానానికి బదులుగా, పాఠ్యపుస్తకాన్ని మొత్తం అవగాహనతో చదివినప్పుడే ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రశ్నాపత్రాల రూపకల్పన చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.