India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ డీల్ ఫైనల్.. ఏ రంగాలకు ఎంత లాభం?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత వాణిజ్య ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీ భారత్ మండపంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, న్యూజిలాండ్ ట్రేడ్ మంత్రి టాడ్ మెక్‌క్లే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఏడాదిలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ఒప్పందానికి ముందుగా న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అవసరం. అక్కడ విదేశాంగ, రక్షణ, వాణిజ్య కమిటీ సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ దీనిని తరతరాలకు ఒకసారి వచ్చే ఒప్పందంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతిదారులకు పెద్ద ఊరట లభించనుంది. మొత్తం 8,284 ఉత్పత్తులపై న్యూజిలాండ్ మార్కెట్లో 100 శాతం సుంక రహిత ప్రవేశం లభించనుంది.
వివరాలు
ఈ రంగాలకు భారీ లాభం
టెక్స్టైల్, లెదర్, ఔషధాలు, యంత్రాలు వంటి రంగాలకు ఇది భారీ లాభం. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వూల్, కలప, బొగ్గు, వైన్, పండ్లపై భారత్ సుంకాలను తగ్గించనుంది. అయితే పాల ఉత్పత్తులు, ఉల్లి, చక్కెర వంటి కీలక వ్యవసాయ రంగాలను భారత్ రక్షించేందుకు ఈ ఒప్పందంలో నుంచి మినహాయించారు. ఇక వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా న్యూజిలాండ్ నుంచి భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది.
వివరాలు
5,000 ప్రొఫెషనల్స్‌కు వీసాలు, 1,000 వర్క్ అండ్ హాలిడే వీసాలు
ఐటీ, ఆరోగ్యం, ఇంజనీరింగ్, విద్య రంగాల్లో భారత నిపుణులకు అవకాశాలు పెరగనున్నాయి. ప్రతి సంవత్సరం 5,000 ప్రొఫెషనల్స్‌కు వీసాలు, 1,000 వర్క్ అండ్ హాలిడే వీసాలు అందించనున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగడంతో పాటు సంబంధాలు బలోపేతం కానున్నాయి. పాల దిగుమతులపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ, దేశీయ రైతుల ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చింది. మొత్తం మీద ఈ ఒప్పందం భారత్‌ను గ్లోబల్ ఫుడ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది.