LOADING...
power miracle: అద్భుతం చేసింది ఇండియా.. సన్‌కు బిగ్ థ్యాంక్స్‌ !
అద్భుతం చేసింది ఇండియా.. సన్‌కు బిగ్ థ్యాంక్స్‌ !

power miracle: అద్భుతం చేసింది ఇండియా.. సన్‌కు బిగ్ థ్యాంక్స్‌ !

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో కరెంట్‌ డిమాండ్‌ ఎప్పుడూ లేనంతగా పెరిగినా ఎక్కడా లోటు లేకుండా సరఫరా జరగడం ఇప్పుడు పెద్ద అద్భుతంగా మారింది. మండే ఎండల మధ్య దేశంలో విద్యుత్‌ అవసరం 256 గిగావాట్లకు చేరినా,బొగ్గు ప్లాంట్లు మాత్రమే కాదు సౌరశక్తి కూడా కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్‌ 25న మధ్యాహ్నం 3:38 గంటలకు దేశం చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ 256.1 గిగావాట్లకు చేరినా ఎలాంటి కొరత రాకుండా సరఫరా కొనసాగింది. ఇందులో సౌరశక్తి సుమారు 21శాతం వాటాతో 57 గిగావాట్లు అందించడం విశేషం. అదే రోజు మధ్యాహ్నం సౌర ఉత్పత్తి 81 గిగావాట్లకు చేరి మొత్తం విద్యుత్‌లో మూడో వంతు అందించింది. గతంలో 2024 మే 30న 250 గిగావాట్లు గరిష్టంగా నమోదైంది.

వివరాలు 

డిమాండ్‌ 271 గిగావాట్లకు చేరొచ్చని కేంద్ర విద్యుత్‌ శాఖ అంచనా

ఈ ఏడాది ఎండల తీవ్రత ముందుగానే మొదలవడంతో ఏప్రిల్‌లోనే విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ఫ్యాన్లు,ఏసీలు,కూలర్లు ఎక్కువగా వాడటం వల్ల డిమాండ్‌ పెరిగి, గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 8.9 శాతం వృద్ధి నమోదైంది. ఈ సంవత్సరం మొత్తం డిమాండ్‌ 271 గిగావాట్లకు చేరొచ్చని కేంద్ర విద్యుత్‌ శాఖ అంచనా వేస్తోంది. ఈ పెరుగుదల మధ్య సౌరశక్తి, జలవిద్యుత్‌ వంటి పునరుత్పాదక వనరులు కీలకంగా మారుతున్నాయి. దేశంలో సౌరశక్తి వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2026 మార్చి నాటికి 150 గిగావాట్లకు పైగా సౌర సామర్థ్యం చేరడం విశేషం. ఒకప్పుడు కొద్ది గిగావాట్లతో ఉన్న సౌరశక్తి ఇప్పుడు ప్రధాన విద్యుత్‌ వనరుగా మారుతోంది. మొత్తం విద్యుత్‌లో సౌరశక్తి వాటా పెరుగుతూ,పునరుత్పాదక వనరుల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది.

వివరాలు 

'పీఎం సూర్యఘర్‌' పథకం ద్వారా ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు

ముఖ్యంగా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో సౌరశక్తి గ్రిడ్‌ను స్థిరంగా ఉంచడంలో కీలకంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కూడా సౌరశక్తి విస్తరణకు దోహదపడ్డాయి. 'పీఎం సూర్యఘర్‌' పథకం ద్వారా ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. అలాగే రైతులకు సోలార్‌ పంపులు అందించే పీఎం కుసుమ్‌ పథకం కూడా మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ చర్యలతో దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. మొత్తంగా చూస్తే, ఒకప్పుడు సహాయకంగా ఉన్న సౌరశక్తి ఇప్పుడు ప్రధాన శక్తిగా మారుతోంది. సూర్యుడి కిరణాలతో దేశం విద్యుత్‌ అవసరాలు తీర్చుకోవడం కొత్త దిశగా మారుతోంది. ఒక్కో ఇంటిపై సోలార్‌ ప్యానెల్‌ పెడుతూ, దేశం స్వచ్ఛమైన శక్తి వైపు ముందుకు సాగుతోంది.

Advertisement