Loading...
DGCA: ఎయిర్‌లైన్స్‌ పైలట్లందరికీ డ్రగ్స్‌ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం
ఎయిర్‌లైన్స్‌ పైలట్లందరికీ డ్రగ్స్‌ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం

DGCA: ఎయిర్‌లైన్స్‌ పైలట్లందరికీ డ్రగ్స్‌ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించే దిశగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కీలక చర్యలు చేపడుతోంది. విమాన ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ఎయిర్‌లైన్స్‌లో పైలట్ల డ్రగ్‌ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేసే అంశంపై దృష్టి సారించింది. ఇటీవల ఫుకెట్‌ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం కుదుపులకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పైలట్ల భద్రతా ప్రమాణాలపై మరింత దృష్టి పడింది. తాజాగా ఎయిరిండియాకు చెందిన మరో ఇద్దరు పైలట్లు డ్రగ్‌ స్క్రీనింగ్‌ పరీక్షల్లో విఫలమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎయిరిండియా,ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ గ్రూపులు తమ సంస్థల్లోని పైలట్లందరికీ డ్రగ్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను తప్పనిసరి చేశాయి.

వివరాలు 

నిబంధనల సవరణపై దృష్టి

ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ అనుసరిస్తున్న ఈ విధానాన్ని దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు వర్తింపజేసేలా డీజీసీఏ చర్యలు తీసుకుంటోంది.

పైలట్లు మాదకద్రవ్యాలు లేదా ఇతర సైకోయాక్టివ్‌ పదార్థాలను వినియోగిస్తున్నారా అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షల విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

పైలట్ల డ్రగ్స్‌ పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్స్‌ (CAR), ఇతర నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయడంపై డీజీసీఏ దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇందుకు అనుగుణంగా డోపింగ్‌ పరీక్షలకు సంబంధించిన నిబంధనలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ప్రత్యేక స్క్రీనింగ్‌ వ్యవస్థ

దేశంలోని అన్ని విమానయాన సంస్థల్లో పైలట్లకు సైకోయాక్టివ్‌ పదార్థాల స్క్రీనింగ్‌ నిర్వహించేందుకు ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనున్నారు.

పరీక్షల విధానం, అమలు ప్రక్రియ, నిబంధనలు తదితర అంశాలను ఇందులో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

ఈ విధానం అమల్లోకి వస్తే దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేసే పైలట్లందరూ డ్రగ్‌ పరీక్షలకు లోనుకావాల్సి ఉంటుంది.

అయితే ఈ అంశంపై డీజీసీఏ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కొత్త నిబంధనలు, పరీక్షల విధానం, వాటి అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ADVERTISEMENT