Page Loader
high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం 
బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం

high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి బెంగళూరులో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ రైలును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య ఉన్న హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో ఉపయోగించనున్నారు. సెప్టెంబర్ 5న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF) ఈ రైళ్ల తయారీకి సంబంధించిన టెండర్‌ను విడుదల చేసింది. ఈ రైళ్లు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగివుండాలని పేర్కొన్నారు. బిడ్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 19గా నిర్ణయించగా, బీఈఎంల్‌ ఒక్కటే దరఖాస్తు సమర్పించింది. ఐసీఎఫ్‌ జనరల్ మేనేజర్‌ యు. సుబ్బారావ్‌ ప్రకారం, త్వరలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తికానుంది. రైలు తయారీకి రెండు సంవత్సరాల వ్యవధి ఉండనుంది.

వివరాలు 

ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1.1 లక్షల కోట్ల వ్యయం 

ఈ రైలు ఖరీదు సుమారు రూ. 200 నుండి రూ. 250 కోట్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 508 కిలోమీటర్ల ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో నిర్మించిన హైస్పీడ్‌ కారిడార్‌లో ఈ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1.1 లక్షల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. అంతకు ముందు, జపాన్‌లో తయారుచేసిన రైళ్లను ఈ మార్గంలో నడిపించాలని అనుకున్నా,అధిక వ్యయం కారణంగా దేశీయంగా నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులో బీఈఎంల్‌, మేధా సెర్వో డ్రైవ్స్‌ కలిసి పని చేయనున్నాయి. ఐరోపా ప్రమాణాలకు అనుగుణంగా ఈ రైలు రూపొందనుంది. మేధా కంపెనీ హైస్పీడ్‌ ప్రొపెల్షన్‌ వ్యవస్థలను తయారు చేస్తుంది, ఇవే ఇప్పటికే వందే భారత్‌ రైళ్లలో ఉపయోగిస్తున్నారు.