Andhra Pradesh: అమరావతిలో తొలి ఏఐ విశ్వవిద్యాలయం… ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే తొలిసారిగా అమరావతిలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ & ఈ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు. భారత్-ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026కు ముందస్తు కార్యక్రమంగా 'ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ డెమో డే'ను బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెక్ భారత్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన నిర్వాహక సంస్థగా వ్యవహరించగా, గీతం డీమ్డ్ వర్సిటీతో పాటు ప్యారడైమ్ ఐటీ సంస్థలు సహ నిర్వాహకులుగా నిలిచాయి.
వివరాలు
ఎన్విడియా సంస్థ భాగస్వామ్యంతో అమరావతిలో ఏఐ విశ్వవిద్యాలయం
ముఖ్య అతిథిగా హాజరైన కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ, ఎన్విడియా సంస్థ భాగస్వామ్యంతో అమరావతిలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధస్సు ప్రస్తుతం ప్రయోగాల దశను దాటి, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, రోజువారీ పాలనా పనుల్లోనూ కీలక పాత్ర పోషించే స్థాయికి చేరిందన్నారు. ఈ డెమో డే సందర్భంగా ప్రభుత్వ పరిపాలన, పౌర సేవల అవసరాల కోసం ఇప్పటికే రూపొందించి, అమలుకు సిద్ధంగా ఉన్న 10 ఏఐ నమూనా వ్యవస్థలను యువత ప్రదర్శించారని వివరించారు. ఈ కార్యక్రమంలో గీతం ప్రో-వీసీ ప్రొఫెసర్ వై. గౌతమ్‌రావు, జీఎస్‌ఐబీ డీన్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పుతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.