Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ట్రయల్ రన్ ప్రారంభం
భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. డిసెంబర్ చివర్లో ట్రయల్ రన్ జరగనుండగా, వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది. తొలిసారిగా ఈ ట్రైన్ జింద్ - సోనిపట్ మార్గంలో నడిచే అవకాశముంది. దిల్లీలోని డివిజన్‌లోని 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావించింది. ప్రస్తుతం భారత రైల్వేలో ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే రైల్వే శాఖ కొత్తగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు 'హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్' అని పిలవనున్నారు. ఈ రైళ్ల వల్ల పర్యావరణానికి అనుకూలంగా ఉండి, కాలుష్యం లేకుండా ప్రయాణం సాగుతుంది.
భారీగా రైల్వే శాఖ పెట్టుబడులు
2030 నాటికి భారతీయ రైల్వేలు నెట్ జీరో కార్బన్ ఎమిటర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, రైల్వే శాఖ భారీగా పెట్టుబడులు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో 35 హైడ్రోజన్ రైళ్ల కోసం రూ.2800 కోట్లు కేటాయించగా, హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ మౌలిక సదుపాయాల కోసం రూ.600 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా డీజిల్ ఆధారిత డెము రైళ్లను హైడ్రోజన్‌తో నడపడానికి కూడా ఒక ప్రాజెక్టు ప్రారంభించింది. దీని కోసం రూ.111.83 కోట్ల కాంట్రాక్ట్‌ను అప్పగించింది. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటిలో హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, రైల్వేలు సోలార్ ప్లాంట్లను, చెట్ల నాట్లును కూడా ప్రోత్సహించనున్నాయి.