LOADING...
Aushadhi Express: హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'
హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'

Aushadhi Express: హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే ఔషధ రవాణా రంగంలో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ సంస్థలకు ఊరటనిస్తూ 'ఔషధి ఎక్స్‌ప్రెస్' పేరుతో దేశంలోనే తొలి ప్రత్యేక ఔషధ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈప్రత్యేక రైలు ఈ నెల 2న హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుకు తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఔషధాల నాణ్యత కాపాడటంలో ఉష్ణోగ్రత నియంత్రణ అత్యంత కీలకమైన అంశం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ రైలులో ఆధునిక శీతల నిల్వ కంటైనర్లను ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్‌లోని వందలాది ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను సురక్షితంగా, తక్కువ సమయంలో ముంబై పోర్టుకు తరలించే అవకాశం కలగనుంది.

వివరాలు 

పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ వినూత్న ప్రయోగం

అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు కూడా మరింత సులభం కానున్నాయి. ఇప్పటివరకు రహదారి మార్గంలో ఔషధాల రవాణా జరగడంతో ఎక్కువ సమయం పట్టేది. అలాగే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా మందుల నాణ్యత దెబ్బతినే ప్రమాదం కూడా ఉండేది. కొత్తగా ప్రారంభించిన ఔషధి ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈ సమస్యలకు చెక్ పడనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

ప్రధాన ఔషధ కేంద్రాలకు విస్తరించే దిశగా ప్రణాళికలు

"ఇది సాధారణ రైలు కాదు.. తెలంగాణ ఔషధ రంగానికి ప్రాణాధారంలా పనిచేస్తుంది. సరైన సమయంలో, నాణ్యమైన ఔషధాలు గమ్యస్థానాలకు చేరేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది" అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశంలోని ఇతర ప్రధాన ఔషధ కేంద్రాలకు కూడా ఇలాంటి ప్రత్యేక రైళ్లను విస్తరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement