LOADING...
Vijayawada: విపత్తుల వేళ సమాచార వ్యవస్థకు కొత్త భరోసా.. ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్లు
ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్లు

Vijayawada: విపత్తుల వేళ సమాచార వ్యవస్థకు కొత్త భరోసా.. ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే తొలిసారిగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ సాంకేతికతను విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇది కొత్త ఆరంభమని, రాష్ట్రంతో పాటు దేశ అభివృద్ధికి ఈ ప్రయోగం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంకుర సంస్థ రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ను బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రయోగించారు. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ బెలూన్‌ విజయవంతంగా గగనతలంలోకి ఎగిరింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ఈ బెలూన్‌ భూమి నుంచి 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందన్నారు.

వివరాలు 

సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ సాంకేతికతను వినియోగిస్తున్న దేశాల జాబితాలో భారత్

ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష, రక్షణ రంగాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఏరోస్పేస్‌ రక్షణ విధానం, శ్రీహరికోట స్పేస్‌ సిటీ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం భవిష్యత్తులో సాంకేతికంగా మరింత ముందుకు వెళ్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసిన రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు కిరణ్‌, శిరీష్‌లను మంత్రి అభినందించారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో చేపట్టినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు కిరణ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ మిషన్‌ను 'సన' పేరుతో ప్రారంభించామని వెల్లడించారు. సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ సాంకేతికతను వినియోగిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరిందన్నారు.

వివరాలు 

బెలూన్‌ను 24గంటల పాటు గాల్లో ఉండేలా రూపొందించాం: శిరీష్

ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఎక్కడైనా సమాచార వ్యవస్థ దెబ్బతింటే కేవలం రెండు గంటల్లోనే పూర్తి స్థాయి సమాచార వలయాన్ని తిరిగి ఏర్పాటు చేసే సామర్థ్యం దీనికి ఉందన్నారు. దూర గ్రామీణ ప్రాంతాల్లో సమాచార సౌకర్యాలు అందించడంలో కూడా ఈ బెలూన్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు శిరీష్‌ మాట్లాడుతూ.. ఉపగ్రహాలతో పోలిస్తే చాలా తక్కువ వ్యయంతో వాతావరణ పరిశోధనలు,భూ పర్యవేక్షణ,విపత్తుల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చన్నారు. ప్రస్తుతం ప్రయోగించిన బెలూన్‌ను 24గంటల పాటు గాల్లో ఉండేలా రూపొందించామని తెలిపారు. భవిష్యత్తులో నెలల తరబడి గగనతలంలోనే కొనసాగగల సూపర్‌ ప్రెజర్‌ బెలూన్లను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.

Advertisement

వివరాలు 

బెలూన్‌ను 24గంటల పాటు గాల్లో ఉండేలా రూపొందించాం: శిరీష్

రౌద్రనెక్స్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యనిర్వాహణ అధికారి ప్రకాష్‌ నవదీప్‌ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత భవిష్యత్తులో కీలక మార్పులకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement