Ursula von der Leyen: భారత్ ఎదుగుదలతో ప్రపంచానికి మేలు.. ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ఆమె మాట్లాడుతూ విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని వ్యాఖ్యానించారు. 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ)-భారత్ మధ్య కుదిరే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి ముందే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడాన్ని ఆమె 'జీవితకాల గౌరవం'గా అభివర్ణించారు. ఈ వేడుకలకు ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో కీలక శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు.
Details
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం ఇరు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత పర్యటనకు ముందు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ, భారత్-ఈయూ మధ్య కుదిరే ఈ 'చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం' ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉన్న రెండు బిలియన్ల జనాభా మార్కెట్లను ఒకటిగా చేస్తుందని చెప్పారు. గత మంగళవారం దావోస్ సమావేశాల్లో ఆమె ఈ ఒప్పందాన్ని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు. యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఈయూ మధ్య ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 135 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Details
2022లో మళ్లీ చర్చలు పునఃప్రారంభం
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు తొలిసారిగా 2007లో ప్రారంభమయ్యాయి. అయితే 2013లో అవి నిలిచిపోగా, 2022లో మళ్లీ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఈయూ నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం ఉన్న 110 శాతం సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలనే యోచనలో భారత్ ఉన్నట్లు సమాచారం. ఈ డీల్ అమలులోకి వస్తే వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజాలకు భారత మార్కెట్‌లో ప్రవేశం మరింత సులభమవుతుంది. అదే సమయంలో భారత ఉత్పత్తులకు కూడా ఈయూ మార్కెట్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.