CM Chandrababu: భారత్ అణు రంగంలో భారీ ముందడుగు.. ఇది గర్వించదగ్గ క్షణమన్న సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
కల్పక్కం అణు కేంద్రంలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ కీలక ఘట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని, దేశ పౌర అణు కార్యక్రమానికి ఇది గొప్ప ప్రోత్సాహమని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది ఒక కీలక ముందడుగని తెలిపారు.
వివరాలు
ఇంధన భద్రత దిశగా దృఢమైన అడుగులు
ఈ విజయంతో దేశంలో ఉన్న విస్తారమైన థోరియం నిల్వలను మూడో దశలో వినియోగించుకునే దిశగా భారత్ మరింత దగ్గరైందని వివరించారు. దీని ద్వారా దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఇంధన భద్రత దిశగా దృఢమైన అడుగులు వేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడంలో ఇలాంటి విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.