LOADING...
Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం
ముంబై తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం

Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై సముద్ర తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధించినవిగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ ఈ నెలలో స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అక్రమ చమురు రవాణా,నిబంధనల ఉల్లంఘనలను అడ్డుకునేందుకు భారత సముద్ర పరిధి అంతటా నిఘాను కట్టుదిట్టం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈట్యాంకర్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6న భారత అధికారులు ఎక్స్‌లో చేసిన ఓపోస్టులో ఈ వివరాలు బయటకు వచ్చాయి గానీ ఆ పోస్టును తర్వాత తొలగించారు.

వివరాలు 

ముంబైకి పశ్చిమాన అనుమానాస్పద కదలికలు

స్టెల్లార్ రూబీ,ఆస్ఫాల్ట్ స్టార్,అల్ జాఫ్జియా అనే ఈ నౌకలు తీర ప్రాంత చట్ట అమలును తప్పించుకునేందుకు తరచూ పేర్లు,గుర్తింపులు మార్చుకుంటూ నడిచినట్టు సమాచారం. వీటి యజమానులు విదేశాల్లో ఉన్నారని వర్గాలు తెలిపాయి. భారత జలాలు చమురు మూలాన్ని దాచేందుకు మధ్య సముద్రంలో జరిగే నౌకల మధ్య బదిలీలకు వేదిక కాకుండా చూడాలన్నదే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ముంబైకి పశ్చిమాన సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో ఈ నౌకలను అడ్డుకుని, విచారణ కోసం ముంబైకి తరలించారు. ఇదిలా ఉండగా, అమెరికా-భారత్ సంబంధాలు బలపడుతున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.

వివరాలు 

55 నౌకలు, 10-12 విమానాలతో 24 గంటల పర్యవేక్షణ

రష్యా చమురు దిగుమతులు నిలిపివేస్తామని భారత్ అంగీకరించడంతో భారత ఉత్పత్తులపై సుంకాలను అమెరికా తగ్గించిన సంగతి తెలిసిందే. స్వాధీనం అనంతరం కోస్ట్ గార్డ్ నిఘాను మరింత పెంచి, సుమారు 55 నౌకలు, 10-12 విమానాలతో 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది. గత ఏడాది అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఓ విభాగం ఇదే ఐఎంఓ నంబర్లతో ఉన్న మూడు నౌకలపై ఆంక్షలు విధించగా, షిప్పింగ్ డేటా ప్రకారం వాటిలో రెండింటికి ఇరాన్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు ఉన్న చమురు ఎక్కువగా తక్కువ ధరలకు విక్రయాలు జరగడం,నకిలీ పత్రాలు తయారు చేయడం, మధ్య సముద్రంలో నౌకల మధ్య చమురు మార్పిడి చేయడం వంటి పద్ధతులతో అసలు మూలాన్ని దాచే ప్రయత్నాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు

Advertisement