Rajnath Singh: స్వయం నిర్ణయంతోనే 'ఆపరేషన్ సిందూర్' నిలిపేశాం.. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ తన సొంత నిర్ణయంతోనే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)స్పష్టం చేశారు. అవసరమైతే దీర్ఘకాల యుద్ధానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని వెల్లడించారు. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామర్థ్యం లేక ఆపరేషన్‌ను నిలిపివేయలేదని, ఇది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ సాయుధ దళాల ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు సాగాయని, నిర్ణయించిన నియమాల ప్రకారమే ఆపరేషన్‌ను ప్రారంభించి సరైన సమయంలో ముగించామని వివరించారు. ఇది స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని, అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.
వివరాలు
పాకిస్థాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు: రాజ్‌నాథ్ సింగ్
ఉగ్రవాదం మానవత్వానికి మాయని మచ్చగా అభివర్ణించిన ఆయన, దీనిపై పోరాటం కేవలం భద్రత కోసం మాత్రమే కాకుండా మానవ విలువలను కాపాడేందుకు కూడా అవసరమని అన్నారు. పాకిస్థాన్‌పై కూడా రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ దేశాన్ని అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, అనేక కోణాలు కలిగిన ప్రమాదమని చెప్పారు. దీనిని వేరుతో సహా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. భారత్ సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచానికి కేంద్రంగా ఎదిగితే, పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని ఆయన విమర్శించారు.