S-400: భారత్‌కు మరిన్ని ఎస్-400లు.. రష్యాతో మరో భారీ డీల్‌కు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తయారీ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌ను మరో ఐదు స్క్వాడ్రన్లు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ వ్యవస్థ అత్యుత్తమంగా పని చేసి పాకిస్థాన్‌కు చెందిన పలు యుద్ధవిమానాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించడంతో దీనిపై భారత వైమానిక దళం విశ్వాసం మరింత పెరిగింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 28 నుంచి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్ ఫ్యూరీ దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ మృతి చెందగా, దీనికి ప్రతీకారంగా టెహ్రాన్ ప్రాంతవ్యాప్తంగా దాడులు చేపట్టింది.
వివరాలు
2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం
ఈ పరిణామాల మధ్య భారత్ తన గగనతల రక్షణను మరింత బలపర్చాలని నిర్ణయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. భారత వైమానిక దళం ప్రతిపాదించిన అదనపు ఐదు ఎస్-400 స్క్వాడ్రన్ల కొనుగోలు ప్రతిపాదనకు త్వరలో అనుమతి లభించే అవకాశం ఉంది. ఈ కొత్త యూనిట్లను తూర్పు, పడమర సరిహద్దుల వెంట మోహరించి భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద మూడు ఎస్-400 వ్యవస్థలు పనిచేస్తుండగా, 2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మరో రెండు యూనిట్లు చేరనున్నాయి.
వివరాలు
క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్న సుదర్శన్ చక్ర
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు జరిపినప్పుడు పాకిస్తాన్ యుద్ధవిమానాలు, ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమర్థంగా పనిచేయకుండా ఎస్-400 వ్యవస్థ అడ్డుకుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా సుదర్శన్ చక్రగా పిలిచే ఈ వ్యవస్థ అడ్డుకుందని సమాచారం. మరోవైపు పాకిస్తాన్ చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను వినియోగించినప్పటికీ అవి భారత వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కోలేకపోయాయని భారత అధికారులు చెబుతున్నారు.
వివరాలు
ఎస్-400 ఇంటర్‌సెప్టర్ మిసైళ్ల నిల్వను పెంచే దిశగా చర్యలు
ఈ నేపథ్యంలో భారత్ ఎస్-400 ఇంటర్‌సెప్టర్ మిసైళ్ల నిల్వను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. రష్యాతో చర్చలు కొనసాగుతుండగా త్వరలోనే కొత్త టెండర్ జారీ చేసే అవకాశం ఉంది. విదేశీ కొనుగోళ్లతో పాటు స్వదేశీ సాంకేతికతను పెంపొందించే లక్ష్యంతో డీఆర్‌డీవో 'ప్రాజెక్ట్ కుషా' పేరుతో దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోంది.