
Postal Services:అమెరికాకు మళ్లీ తపాలా సర్వీసులు.. నేటి నుంచే అమలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు తపాలా సేవలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు భారత తపాలా శాఖ మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచి అన్ని రకాల పోస్టల్ సేవలు పునరుద్ధరించనున్నట్టు తెలిపింది. కొద్ది నెలల క్రితం అమెరికా కస్టమ్స్ విభాగం అంతర్జాతీయ వాణిజ్య సరుకులను రవాణా చేసే కొరియర్ సంస్థలపై అదనపు సుంకాలు విధించింది. అయితే భారత తపాలా శాఖ ద్వారా పంపే సరుకులకు ఆ సుంకాలు వర్తించవు. కొత్త నియమాలకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేపట్టేందుకు తపాలా శాఖ ఆగస్టు 22నుంచి అమెరికాకు పంపే సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజా నిబంధనల ప్రకారం అమెరికాకు తపాలా శాఖ ద్వారా రవాణా చేసే సరకులపై ప్రకటిత సరుకు విలువలో 50 శాతం కస్టమ్స్ సుంకంగా చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
లాభపడనున్న ఎంఎస్‌ఎంఈలు
ఈ నిర్ణయం భారతీయ ఎగుమతిదారులకు అనుకూలమని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), చేతివృత్తులవారు, ఈ-కామర్స్ వ్యాపారులు వంటి వర్గాలకు ఆర్థిక భారం తగ్గుతుందని తపాలా శాఖ పేర్కొంది. పోస్టల్ ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదని, అందువల్ల మన ఎంఎస్‌ఎంఈలు మరింత లాభపడతాయని వివరించింది.