PM Modi US Tour: 26/11 దోషుల అప్పగింత,500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం: మోదీ-ట్రంప్ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తిగా ఎదురుచూసిన ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి) ముగిశాయి.
ఈ సమావేశంలో, వాణిజ్యం నుంచి సాంకేతికత వరకు అనేక కీలక అంశాలపై చర్చ జరిగింది.
రక్షణ రంగంతో పాటు వివిధ విభాగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునే దిశగా దృఢ నిర్ణయాలు తీసుకున్నారు.
భద్రత, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ చర్చించారని, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఈ సంభాషణలో, రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు.
వివరాలు
మోదీ పర్యటనలో భారత్-అమెరికా మధ్య జరిగిన కీలక ఒప్పందాలు
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయం. దీని అర్థం చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్ (QUAD)కు ప్రాధాన్యత ఇస్తారు. క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉంటాయి.
.ఖనిజాలు, మెటీరియల్స్, ఔషధ సరఫరా గొలుసు బలోపేతం. కీలక ఖనిజాలు, ఆధునిక మెటీరియల్స్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉమ్మడిగా తయారీ, అభివృద్ధి, సాంకేతిక మార్పిడి ప్రాధాన్యత కల్పించనున్నారు.
లాస్ ఏంజిల్స్, బోస్టన్‌లో భారత కాన్సులేట్ల ఏర్పాటు. భారతీయ విద్యార్థులు, వలసదారులకు మరింత సేవలు అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. అలాగే, భారతదేశంలో అమెరికన్ విశ్వవిద్యాలయాల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
వివరాలు
మోదీ పర్యటనలో భారత్-అమెరికా మధ్య జరిగిన కీలక ఒప్పందాలు
భారత్-అమెరికా మధ్య చమురు,గ్యాస్ వ్యాపారం విస్తరణ. ఇకపై భారత్, అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోనుంది.
భారత అణుశక్తి రంగానికి అమెరికా మద్దతు. ముఖ్యంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (SMRs) అభివృద్ధికి సహకరించనుంది.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఉమ్మడి చర్యలు. 26/11 ముంబై దాడుల సూత్రధారి తహవ్వూర్ రానోను త్వరలో అమెరికా నుంచి భారత్‌కు అప్పగించనున్నారు.
భారత్‌కు అత్యాధునిక యుద్ధ విమానాల సరఫరా. అమెరికా నుంచి భారత్ కీలకంగా F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నది.
IMEC కారిడార్ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ద్వారా, భారత్ నుంచి ఇజ్రాయెల్, ఇటలీ, అమెరికాకు కొత్త వాణిజ్య మార్గాలు అభివృద్ధి చేయనున్నారు.
వివరాలు
సుంకాలు & డీపోర్టేషన్ అంశాలు:
సుంక విధానంపై స్పష్టత లేదు: కానీ ట్రంప్ ఇప్పటికే 'టిట్ ఫర్ టాట్' విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాల్సి ఉంది. అయితే, 2030 నాటికి ఇండియా-అమెరికా వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించారు.
డీపోర్టేషన్ కొనసాగింపు: అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులను తిరిగి భారత్‌కు పంపే ప్రక్రియ కొనసాగనుంది. అయితే, వారిని బలవంతంగా తీసుకువస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.