Tariff Cuts: భారత్-అమెరికా వాణిజ్య వివాదం.. సుంకాల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించలేదని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ అధిక సుంకాలు విధిస్తోందని విమర్శలు గుప్పించడంతో, ఈ అంశంపై భారతదేశం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను అమలు చేస్తున్నారు.
భారత్ తమ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తోందని ఆయన ఆరోపిస్తూ, వచ్చే నెల రెండో తేదీ నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయని తెలిపారు.
భారత్ అధిక సుంకాలు వసూలు చేస్తోందని, దేశంలో విదేశీ వస్తువుల అమ్మకాన్ని కష్టతరం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ చేసిన మరో ప్రకటనలో, భారత్ సుంకాలను తగ్గించడానికి అంగీకరించిందని పేర్కొన్నారు.
Details
సెప్టెంబర్ వరకూ సమయం
ఈ నేపథ్యంలో తాజాగా భారత ప్రభుత్వం స్పందిస్తూ, సుంకాల తగ్గింపునకు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరినట్లు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కృషి కొనసాగుతుందని, తక్షణ సుంకాల సర్దుబాటుకు బదులుగా దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టిపెడుతున్నామని వాణిజ్య శాఖ కార్యదర్శి వివరించారు.
విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ట్రంప్ పాలన, అమెరికా విధానాలపై స్పందిస్తూ, ప్రపంచ శక్తివంతమైన దేశాలందరికీ సమాన అధికారాలు ఉండాలనే ఆలోచనకు అమెరికా పాలన దగ్గరగా ఉందన్నారు.
ఇది భారత వ్యూహాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.