LOADING...
Pm Modi: 'ఉగ్రవాదానికి భారత్ తలవంచదు'.. పహల్గామ్ దాడిని స్మరించుకుంటూ.. ప్రధాని మోదీ హెచ్చరిక..!
ప్రధాని మోదీ హెచ్చరిక..!

Pm Modi: 'ఉగ్రవాదానికి భారత్ తలవంచదు'.. పహల్గామ్ దాడిని స్మరించుకుంటూ.. ప్రధాని మోదీ హెచ్చరిక..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది. గత ఏడాది ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ పహల్గాం వీధుల్లో మాయంకాకుండా గాయాల్లా మిగిలి ఉన్నాయి. ఆ దాడి అనంతరం ప్రభుత్వం దాదాపు 45 పర్యాటక ప్రదేశాలను మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పహల్గాం స్మారక స్థలం వద్ద బాధిత కుటుంబాలు చేరుకొని నివాళులు అర్పించాయి. మరోవైపు, ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో లోయలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

వివరాలు 

బాధిత కుటుంబాలకు మోదీ హృదయపూర్వక సానుభూతి

ప్రత్యేక దళాలు అణువణువూ గాలిస్తూ, సానుభూతిపరుల ఇళ్లలో శోధనలు నిర్వహిస్తున్నాయి. దాల్ సరస్సు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భయం నీడలు ఉన్నప్పటికీ, వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు దాల్ సరస్సు వద్దకు చేరుకుంటూనే ఉన్నారు. పహల్గాం దాడికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకున్నారు. వారిని ఎప్పటికీ మరచిపోలేమని స్పష్టం చేశారు. ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి భారతదేశం తలవంచదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుష్ట యత్నాలు ఎప్పటికీ ఫలించవని హెచ్చరించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఆయన హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు.

వివరాలు 

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబొం: మోదీ  

సామాజిక మాధ్యమ వేదికలో చేసిన ప్రకటనలో, గత సంవత్సరం ఇదే రోజున జరిగిన ఆ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను గుర్తు చేసుకుంటున్నానని తెలిపారు. వారి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశంగా మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఏకమై ఉన్నామని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

Advertisement

వివరాలు 

బైసరణ్ లోయ సమీపంలో స్మారక శిలాఫలకం 

ఇక ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది జ్ఞాపకార్థం బైసరణ్ లోయ సమీపంలో స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అందులో మరణించిన వారి పేర్లు, వారు వచ్చిన రాష్ట్రాల వివరాలు నమోదు చేశారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు, స్థానికులు అక్కడికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఈ విషాద ఘటనను దాటి, శాంతి, భద్రతల పునరుద్ధరణ కోసం అధికారులు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు మళ్లీ భారీగా వస్తున్నారు.

వివరాలు 

పర్యాటకుల్లో నమ్మకం పెంచేందుకు అధికారులు కొత్త విధానం ప్రవేశపెట్టారు

పర్యాటకుల్లో నమ్మకం పెంచేందుకు అధికారులు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. QR కోడ్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీని ద్వారా పర్యాటకులు, స్థానిక వ్యాపారుల వివరాలను సులభంగా పరిశీలించే అవకాశం కల్పించారు. ఈ కఠిన భద్రతా చర్యలపై పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఒక ఘటన ఆధారంగా ఈ ప్రాంతాన్ని అంచనా వేయలేమని, ప్రస్తుతం ఇక్కడ భద్రత మెరుగ్గా ఉందని వారు చెబుతున్నారు. స్థానికుల సహకారం కూడా మంచిదేనని, ఎలాంటి భయం లేకుండా పర్యటించవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పర్యాటకులు కూడా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉందని, భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు అందిస్తున్న భద్రతపై తమకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు.

Advertisement